
మెగాస్టార్ చిరంజీవి మరోసారి ‘చిరు లీక్స్’తో వార్తల్లో నిలిచారు. వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న చిరంజీవి.. తన 158వ సినిమాకు సంబంధించిన కీలక విషయాన్ని అనుకోకుండా బయటపెట్టారు. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘కదిరి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఆయన మాటల్లో వెల్లడైంది.
‘కదిరి’ అంటూ చిరంజీవి లీక్..
చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్న ఈ మూవీ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
అయితే సక్సెస్ మీట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో మాట్లాడుతున్న సమయంలో చిరంజీవి.. “టీజర్ మ్యూజిక్ పూర్తయిందా? చివర్లో ‘కదిరి’ అని టైటిల్ కార్డ్ వేశారా?” అని అడిగారు. దీంతో సినిమా టైటిల్ ‘కదిరి’ అని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
ఆగస్టు 22న టీజర్?
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రియమణి, రచితా రామ్, నివేదా పేతురాజ్, అనస్వర రాజన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి–బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘కదిరి’పై మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అధికారిక ప్రకటనకు ముందే చిరంజీవి టైటిల్ లీక్ చేయడంతో ‘చిరు లీక్స్’ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
