
DNews Dec18 2025: న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల బిఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను తోసిపుచ్చడంపై కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్పీకర్ నిర్ణయం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని, ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ.. ‘ఫిరాయింపు జరిగినట్లు ఆధారాలు లేవు’ అని స్పీకర్ తీర్పు ఇవ్వడంపై పాల్ మండిపడ్డారు. “కళ్లున్న వారు ఎవరైనా ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారారని చెబుతారు, కానీ స్పీకర్‌కు మాత్రం అవి ఆధారాలుగా కనిపించలేదా?” అని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు.
