
D Spiritual: Nov 17: యాదగిరిగుట్ట: పవిత్ర కార్తీక మాసం, కార్తీక సోమవారం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం పలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం 6.30 గంటల నుంచి దేవస్థాన ప్రాంగణంలోని అఖండ దీపం వద్ద 250 మంది ముత్తయిదువులకు ఆలయ అధికారులు వాయనాలు పంపిణీ చేశారు. పసుపు, కుంకుమ, గాజులతో పాటు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వాయనాలను స్వీకరించారు.
అనంతరం దేవస్థానం అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక దీపారాధన నిర్వహించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి జె. భవానీ శంకర్ పాల్గొని కార్తీక దీపాన్ని వెలిగించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ దీపారాధన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కార్తీక మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యత ఉందని తెలిపారు. దీపజ్యోతి దైవానుగ్రహానికి, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నరసింహమూర్తి, మహిళా భక్తులు, పలువురు భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
