Dharani Land Scam: CID Arrests Five More, Total Number of Accused Reaches Nine

ధరణి పోర్టల్‌లో భూ రికార్డుల అక్రమ మార్పుల వ్యవహారంపై తెలంగాణ సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. తాజాగా మరో ఐదుగురిని అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసులో చర్యలు ఎదుర్కొన్న వారి సంఖ్య తొమ్మిదికి చేరింది.

తెలంగాణలో ధరణి పోర్టల్ భూ రికార్డుల అక్రమాల వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన అధికారులు.. తాజాగా మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మందిపై చర్యలు తీసుకున్నారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఇందుకోసం 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, గజ్వేల్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ధరణి పోర్టల్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ఆపరేటర్లపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

భూ రికార్డుల మార్పులపై ఫోకస్

ధరణి పోర్టల్‌లోకి అక్రమంగా లాగిన్ అయి విలువైన భూముల రికార్డులను మార్చినట్లు సీఐడీ అనుమానిస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్‌లో గుర్తించిన డిజిటల్ ఆధారాల సహాయంతో ఈ అక్రమాల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా భూముల యాజమాన్య హక్కులను అక్రమంగా బదిలీ చేసిన ఘటనలపై ఆరా తీస్తోంది.

కోర్టు కేసులు, మధ్యంతర ఉత్తర్వులను ఆసరాగా చేసుకుని భూ రికార్డుల్లో మార్పులు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా భూదాన్ భూములకు బైనంబర్లు సృష్టించి యాజమాన్య హక్కులు మార్చిన వ్యవహారంపైనా విచారణ కొనసాగిస్తున్నారు.

ఏడుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ

సీఐడీ డీజీ చారుసిన్హా నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పోర్టల్ లాగిన్ వివరాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, భూ రికార్డుల్లో జరిగిన మార్పులు, వాటి వెనుక ఉన్న వ్యక్తుల పాత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *