
D Spiritual: Dec 11: శ్రీకాళహస్తి పట్టణంలో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఏడుగంగమ్మల జాతర నిర్వహించడం ఒక శతాబ్దాల సంప్రదాయం. అధికారులు కొన్ని నిబంధనలు అమలు చేసినప్పటికీ, ఈ ఏడాది భక్తులు సునామీలా తరలి వచ్చారు. సంప్రదాయ బద్ధంగా అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతరను నిర్వాహకులు పరస్పరం పోటీగా, ఘనంగా నిర్వహించడం గమనార్హం. జాతరలో భక్తులు వేయికళ్ల దుత్తలతో తమ మొక్కులు తీర్చుకున్నారు. ముఖ్యంగా మహిళాభక్తులు వేపాకు ధరించి, నెత్తిపై దుత్తలు పెట్టుకుని అందులో దీపాలు వెలిగించి గంగమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేసి, అనంతరం అమ్మవారి ముందు దుత్తలను పగులగొట్టడం ఒక ఆనవాయితీ. గంగమ్మమాల ధరించిన భక్తులు కూడా ఇదే విధంగా మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఏడాది నిర్వాహకులు సమయపాలనపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు.
శ్రీకాళహస్తి ఏడుగంగమ్మల జాతరలో ప్రత్యేక అలంకారాలు
ప్రతి ఏడాది గంగమ్మ జాతరలో వందలాది జంతుబలులు కనిపించేవి; రోడ్లు కూడా రక్తసిక్తమయ్యేవి. కానీ ఈసారి ఆ వాతావరణం కనిపించలేదు. ఇందుకు కారణం—అమ్మవారి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం ఏకాంతంగా నిర్వహించడం. దారి వెంబడి భక్తులు తమ స్థోమత మేరకు కుంభాలు వేసి, పిండిదీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకున్నారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న జాతర సందర్భంగా వివిధ అమ్మవార్లకు ప్రత్యేక అలంకారాలు, సప్పరాలు రూపొందించారు. పెండ్లిమండపం వద్ద ప్రతిష్ఠించబడిన పొన్నాలమ్మకు కాత్యాయిని దేవి అలంకారం, రాజరాజేశ్వరి విశ్వరూప ప్రభ, అశ్వాలు, మయూర వాహనాలు ఏర్పాటు చేశారు. కొండమిట్టలోని ముత్యాలమ్మకు శ్రీ కనకదుర్గాదేవి అలంకారం, పుష్ప ప్రభ సింహావాహనం అలంకరించారు.
జయరామారావు వీధిలోని అమ్మవారికి త్రిశూల మహాశక్తి ప్రభ–భవాని అలంకారం హంస వాహనంతో రూపొందించారు. గోపురం వద్దనున్న సన్నిధి వీధి అమ్మవారికి శ్రీ రేణుకాదేవి అలంకారం, సింహావాహనం సిద్దం చేశారు. తేరు వీధి–బాపన వీధి నల్ల గంగమ్మకు మహాకాళికాదేవి అలంకారం, ముత్యాల మండపం మరియు సింహగర్జన వాహనం ఏర్పాటు చేశారు.
గాంధీ వీధి గంగమ్మకు శ్రీ జ్వాలా త్రిపురసుందరి అలంకారం, మయూర వాహన ప్రభ సిద్దంచేశారు. కొత్తపేట గంగమ్మకు భువనేశ్వరీ–శీతలాంబదేవి అలంకారం, నాగేంద్ర వాహనం పై ప్రతిష్టించి తీర్చి దిద్దారు.
