
D Spiritual: Oct 16: బాసరలో మూల నక్షత్రం వేడుకలు ఘనంగా.. అక్షరాభ్యాసాల కోసం పోటెత్తిన భక్తులు
అక్షరాభ్యాసాలకు ప్రసిద్ధి చెందిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో మూల నక్షత్రం వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి జన్మనక్షత్రం సందర్భంగా తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అర్ధరాత్రి నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులతో క్షేత్రం కిటకిటలాడింది. వేకువజామున మూడు గంటల నుంచే అర్చకులు అక్షరాభ్యాస పూజలను ప్రారంభించడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
అమ్మవారిని దర్శించుకున్న ముధోల్ ఎమ్మెల్యే
మూల నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ నాయకులతో కలిసి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. పుష్కరాల లోపు ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. రూ.2,000, రూ.150 అక్షరాభ్యాస మండపాలకు వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. భక్తులకు ఉచితంగా పాలు, పండ్లు, మంచినీటిని పంపిణీ చేశారు. ఆలయ ఈవో అంజనాదేవి ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ దర్శనాలు, అక్షరాభ్యాస కార్యక్రమాలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు.
200 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత
మూల నక్షత్రం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్మల్ జిల్లా పోలీసు శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. సుమారు 200 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణతో పాటు గోదావరి స్నాన ఘట్టాల వద్ద భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలపాలని, చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న బాసర క్షేత్రం
మూల నక్షత్రం వేడుకలతో బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయం భక్తులతో సందడిగా మారింది. విద్యాభివృద్ధి, జ్ఞానప్రాప్తి కోసం భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు, పోలీసు సిబ్బంది సమన్వయంతో భక్తులకు అవసరమైన సేవలను అందిస్తున్నారు. మూల నక్షత్రం సందర్భంగా చిన్నారుల అక్షరాభ్యాసాలతో బాసర క్షేత్రం ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది.
