పీఎం2.5 అంటే ఏమిటి?

D news:nov:19పీఎం2.5 అనేవి 2.5 మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువ పరిమాణంలో ఉండే అత్యంత సూక్ష్మ ధూళి కణాలు. వాహనాల పొగ, పరిశ్రమలు, విద్యుత్ కేంద్రాలు, నిర్మాణ పనులు, ఇంధనాల దహనం వీటి ఉత్పత్తికి ప్రధాన కారణాలు. ఇవి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి వాపును కలిగించడంతోపాటు గుండె, రక్తనాళాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. నైట్రోజన్ డయాక్సైడ్ (NO₂) కూడా వాహనాలు, పరిశ్రమలు, గ్యాస్ స్టవ్‌లు, హీటర్ల నుంచి వెలువడే ప్రమాదకర వాయు కాలుష్య కారకం.

డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం పీఎం2.5 వార్షిక సగటు స్థాయి ప్రతి ఘనపు మీటరు గాలిలో 5 మైక్రోగ్రాములు, నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయి 10 మైక్రోగ్రాములకు మించకూడదు. పీఎం2.5 స్థాయులను ఈ పరిమితికి తగ్గిస్తే ఏటా సుమారు 94 లక్షల మరణాలను నివారించవచ్చని లేదా వాయిదా వేయవచ్చని అధ్యయనం అంచనా వేసింది.

తక్కువ స్థాయి లక్ష్యాలతోనూ ప్రయోజనాలు

నైట్రోజన్ డయాక్సైడ్ కాలుష్యాన్ని కూడా డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశించిన స్థాయికి తగ్గిస్తే మరో 11 లక్షల మరణాలను నివారించవచ్చని పరిశోధకులు తెలిపారు. లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించలేకపోయినా, కాలుష్య స్థాయులను కొంతమేర తగ్గించడం ద్వారా గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొన్నారు.

కాలుష్య నియంత్రణతో దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి (సీఓపీడీ) కేసులు 28 లక్షలు, డిమెన్షియా కేసులు 11 లక్షలు, గుండె ధమనులకు సంబంధించిన వ్యాధుల కేసులు 73 లక్షలు, పక్షవాతం కేసులు 23 లక్షల వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఆర్థికంగానూ భారీ ఆదా

వాయు కాలుష్యాన్ని నియంత్రించడం వల్ల ప్రాణాలను కాపాడటమే కాకుండా వైద్య ఖర్చులను కూడా గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనం వెల్లడించింది. పీఎం2.5 మార్గదర్శకాలను అమలు చేయడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల చికిత్సకు అయ్యే ప్రత్యక్ష వైద్య ఖర్చుల్లో ఏటా 11.8 బిలియన్ డాలర్లు, పక్షవాతం చికిత్సలో 5.9 బిలియన్ డాలర్లు, డిమెన్షియా చికిత్సలో 8.6 బిలియన్ డాలర్లు ఆదా చేయవచ్చని పేర్కొంది.

వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామిక అభివృద్ధి, వ్యక్తిగత వాహనాల వినియోగం తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో వాయు కాలుష్యం తీవ్రత పెరగడానికి ప్రధాన కారణాలని పరిశోధకులు వివరించారు.

రవాణా వ్యవస్థ, పట్టణ ప్రణాళిక, ఇంధన విధానాల్లో మార్పులు తీసుకురావడం ద్వారా స్వచ్ఛమైన గాలిని అందించవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఆర్థిక అభివృద్ధికి ఆటంకం కలగకుండా ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కాలుష్య నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఈ అధ్యయనం ‘ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్’ జర్నల్‌లో ప్రచురితమైంది. 136 తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు సంబంధించిన వాయు కాలుష్యం, జనాభా, ఆరోగ్య గణాంకాలను విశ్లేషించి పరిశోధకులు ఈ అంచనాలను రూపొందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *