
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. భారత మాజీ స్టార్ పేసర్ జహీర్ ఖాన్‌ను జట్టు కొత్త హెడ్ కోచ్‌గా నియమించింది. సెప్టెంబర్ 21న సీఎస్కే మేనేజ్‌మెంట్ జహీర్ నియామకాన్ని అధికారికంగా వెల్లడించింది. దీంతో సుమారు 18 ఏళ్లుగా జట్టుతో కొనసాగిన స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానాన్ని జహీర్ భర్తీ చేయనున్నాడు.
జహీర్ పేరును సూచించింది ధోనీయే!
జహీర్ ఖాన్‌ను హెడ్ కోచ్‌గా ఎంపిక చేయడం వెనుక మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కీలకంగా వ్యవహరించినట్లు సీఎస్కే CEO కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. హెడ్ కోచ్ పదవికి జహీర్ పేరును మొదటగా సూచించింది ధోనీయేనని ఆయన తెలిపారు.
ధోనీ ప్రతిపాదనకు సీఎస్కే క్రికెట్ మేనేజ్‌మెంట్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా సమ్మతించడంతో జహీర్‌ను సంప్రదించినట్లు కాశీ విశ్వనాథన్ చెప్పారు. జహీర్‌కు ఇప్పటికే ఐపీఎల్‌లో కోచింగ్, టీమ్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన అనుభవం ఉండటం కూడా అతడి ఎంపికకు ప్రధాన కారణమని వివరించారు.
ముంబై, లక్నో జట్లతో అనుభవం
ఆటగాడిగా అద్భుతమైన కెరీర్ కలిగిన జహీర్ ఖాన్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీల మేనేజ్‌మెంట్‌లోనూ అనుభవం ఉంది. ముంబై ఇండియన్స్‌తో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్‌గా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్‌తో మెంటార్, బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
ఈ అనుభవం కారణంగానే సీఎస్కే హెడ్ కోచ్ బాధ్యతలకు జహీర్ సరైన వ్యక్తిగా భావించినట్లు కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు.
జహీర్‌ను ఒప్పించేందుకు చర్చలు
అయితే సీఎస్కే హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరించేందుకు జహీర్‌ను ఒప్పించడం వెంటనే జరగలేదట. మేనేజ్‌మెంట్ అతడితో పలుమార్లు చర్చించిన తర్వాతే ఈ బాధ్యతలు తీసుకునేందుకు జహీర్ అంగీకరించినట్లు కాశీ విశ్వనాథన్ తెలిపారు.
ధోనీ, జహీర్ ఇద్దరూ భారత జట్టుకు కలిసి ఆడిన అనుభవం ఉంది. దీంతో ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉండటం కూడా సీఎస్కే కొత్త కోచింగ్ వ్యవస్థకు ఉపయోగపడే అంశంగా భావిస్తున్నారు.
కోచింగ్ స్టాఫ్‌లోనూ మార్పులు?
జహీర్ రాకతో సీఎస్కే కోచింగ్ సెటప్‌లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై ఆసక్తి నెలకొంది. కొత్త హెడ్ కోచ్‌కు తనకు అనుకూలమైన సహాయక కోచింగ్ సిబ్బందిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
అదే జరిగితే ఐపీఎల్ 2027 ప్రారంభానికి ముందే సీఎస్కే కోచింగ్ విభాగంలో మరిన్ని మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే 2026 సీజన్‌కు ముందు ఆటగాళ్ల బృందంలో మార్పులు చేసిన సీఎస్కే.. ఇప్పుడు హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ రాకతో తమ కోచింగ్ వ్యవస్థను కూడా కొత్త దిశగా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.
