
DNews: Mar18: ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాల ప్రభావం వల్ల మనం గ్యాస్, పెట్రోల్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వీటి కోసం మనం కూడా విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఎక్కడైనా యుద్ధం చెలరేగితే, మన దేశంలో, మన రాష్ట్రంలో సమస్యలు తప్పవు. అందుకే కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న సహజ వాయు నిల్వలను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి సారించింది. ‘మిషన్ ఎక్స్‌ప్లోరేషన్’ పేరుతో ముడి చమురు నిల్వల వేట ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ‘మిషన్ ఎక్స్‌ప్లోరేషన్’ పేరుతో సహజ వాయు నిల్వల కోసం సర్వే నిర్వహిస్తున్నారు.
ఈ సర్వే మొదటి దశలో ఏపీలోని విజయనగరం జిల్లా భోగాపురం నుంచి కాకినాడ జిల్లాలోని పెద్దాపురం వరకు, అక్కడి నుంచి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం వరకు చేపట్టారు. ఈ సర్వేను ఓఎన్‌జీసీ, ఆల్ఫా జియో సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. శాటిలైట్ ద్వారా సర్వే చేయాల్సిన ప్రాంతాలను గుర్తించారు. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో సర్వే కొనసాగుతోంది. అనకాపల్లి జిల్లా మండలాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. నక్కపల్లె, పాయకరావుపేట, ఎస్. రాయవరం, రాంబిల్లి మరియు మునగపాక మండలాల్లోని పంట భూముల్లో సహజ వాయు నిల్వలను గుర్తించేందుకు 60 అడుగుల లోతులో డ్రిల్లింగ్ జరుగుతోంది. ‘మిషన్ ఎక్స్‌ప్లోరేషన్’ పేరుతో చేపట్టిన ఈ సర్వేను రాబోయే నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
