ప్రపంచ అగ్రశక్తిగా కొనసాగుతున్న అమెరికాకు చైనా నుంచి పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇటీవల వాషింగ్టన్‌లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన తన ప్రత్యేక వాహనాన్ని కూడా అమెరికాకు తీసుకొచ్చారు. అత్యాధునిక సాంకేతికత, భద్రతా సదుపాయాలతో రూపొందించిన ఈ వాహనం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించే ‘ది బీస్ట్’కు ఏమాత్రం తీసిపోదనే చర్చ సాగుతోంది. ఒకప్పుడు విదేశాల నుంచి కార్లను దిగుమతి చేసుకున్న చైనా.. ఇప్పుడు అత్యాధునిక, భద్రతా ప్రమాణాలతో కూడిన వాహనాలను సొంతంగా తయారు చేసే స్థాయికి చేరుకుంది.

ప్రపంచ అగ్రశక్తిగా ఎదగాలనే చైనా ప్రయత్నాలకు ఈ వారం అమెరికాలో చోటుచేసుకున్న పరిణామాలు మరో ఉదాహరణగా నిలిచాయి. అమెరికా పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తన అధికారిక ప్రయాణాల కోసం అమెరికా వాహనాలు లేదా భద్రతా ఏర్పాట్లపై ఆధారపడలేదు. పసిఫిక్ మహాసముద్రాన్ని దాటించి, చైనా అత్యంత రహస్యంగా అభివృద్ధి చేసిన బుల్లెట్‌ప్రూఫ్ లిమోజిన్ ‘హాంగ్‌చీ ఎన్701’ (Hongqi N701)ను వాషింగ్టన్‌కు తీసుకువచ్చారు.

సుమారు 18 అడుగుల పొడవున్న ఈ ప్రత్యేక వాహనం చైనా సాంకేతిక సామర్థ్యానికి, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి ప్రతీకగా నిలిచింది. ఒకప్పుడు పాశ్చాత్య దేశాల నుంచి విలాసవంతమైన కార్లను దిగుమతి చేసుకున్న చైనా.. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి అధికారిక వాహనం ‘ది బీస్ట్’కు దీటుగా భద్రతా లక్షణాలతో కూడిన సొంత లిమోజిన్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తోంది.

‘హాంగ్‌చీ’ అనే పదానికి చైనీస్‌లో ‘ఎర్రజెండా’ అని అర్థం. సాధారణ ప్రజల కొనుగోలుకు ఈ కారు మార్కెట్లో అందుబాటులో ఉండదు. ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వాహనం బరువు మూడు టన్నులకు పైగానే ఉంటుందని సమాచారం. ఇందులో బుల్లెట్‌ప్రూఫ్, బాంబు దాడులను తట్టుకునేలా రూపొందించిన గాజు, రన్-ఫ్లాట్ టైర్లు, సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థ, విష వాయువుల నుంచి రక్షణ కల్పించే సాంకేతికత వంటి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటనలో ఈ వాహనం వినియోగం కేవలం రవాణా సౌకర్యానికే పరిమితం కాలేదు. తన అత్యున్నత నాయకత్వానికి అవసరమైన వాహన భద్రతను, సాంకేతిక సామర్థ్యాన్ని స్వయంగా సమకూర్చుకునే స్థాయికి చైనా చేరుకుందని చాటిచెప్పే ప్రతీకాత్మక చర్యగా ఇది నిలిచింది. ఒకప్పుడు విదేశీ కార్లపై ఆధారపడిన చైనా.. ఇప్పుడు అత్యంత కీలకమైన అధికారిక రవాణా వ్యవస్థలోనూ స్వయంపూర్తి దిశగా అడుగులు వేస్తోందన్న సందేశాన్ని ఈ హాంగ్‌చీ ఎన్701 ప్రపంచానికి అందించింది.