
D Spiritual: Nov 7: భక్తులకు కీలక సూచన!
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 8వ తేదీ ఆదివారం నిత్య కైంకర్యాల సమయాల్లో మార్పులు చేసినట్లు దేవస్థానం ఈవో జే. భవానీ శంకర్ వెల్లడించారు. ఈ మేరకు భక్తులు కొత్త దర్శన వేళలను గమనించాలని సూచించారు.
ఆదివారం తెల్లవారుజామున 3.30 నుంచి 4 గంటల వరకు సుప్రభాతం, 4 నుంచి 4.45 గంటల వరకు స్వామివారికి ఆస్థాన మంగళహారతులు నిర్వహించనున్నారు. అనంతరం 4.45 నుంచి 5.45 గంటల వరకు తిరువారాధన, బాలభోగం, ఆరగింపు కార్యక్రమాలు, 5.45 నుంచి 6.45 గంటల వరకు నిజాభిషేకం, 6.45 నుంచి 7.15 గంటల వరకు సహస్రనామార్చన నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఉదయం 7.15 గంటల నుంచి యథావిధిగా దర్శనాలు
ఉదయం 7.15 గంటల నుంచి ఉభయ దర్శనాలతో పాటు సుదర్శన నారసింహ హవనం, స్వామివారి కల్యాణం తదితర పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగనున్నాయి. అయితే నిత్య కైంకర్యాల వేళల్లో మార్పుల కారణంగా ఆరోజు సుప్రభాత దర్శనం టికెట్లను రద్దు చేసినట్లు ఈవో స్పష్టం చేశారు.
కాబట్టి యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు దర్శన సమయాల్లో మార్పులను ముందుగానే గమనించి, అందుకు అనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని దేవస్థానం అధికారులు కోరారు.
