Cancer Survivor to Make Her Acting Debut: Vivek Oberoi Gets Emotional Over Daughter Sahara Shah’s Journey

D News : బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌కు సంబంధించిన ఓ ఎమోషనల్ మూమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన దత్తత కుమార్తె సహారా షా క్యాన్సర్‌ను జయించి ఇప్పుడు హీరోయిన్‌గా సినీ రంగంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసి వివేక్ భావోద్వేగానికి గురయ్యారు. ఆమె నటిస్తున్న నేపాలీ సినిమా పోస్టర్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు.

వివేక్ ఒబెరాయ్, ఆయన భార్య ప్రియాంకకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులకు తన వంతు సహాయం అందిస్తూ వస్తున్న వివేక్.. సహారా షాను రెండున్నరేళ్ల వయసులో దత్తత తీసుకున్నారు. ఆమెకు అవసరమైన వైద్య చికిత్సతో పాటు విద్య అందించడంలోనూ అండగా నిలిచారు.

సహారాను ‘క్యాన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్’కు పరిచయం చేయడంతో అక్కడ ఆమెకు చికిత్స అందింది. క్యాన్సర్‌ను జయించిన అనంతరం ఉన్నత చదువులు పూర్తి చేసిన సహారా.. కమర్షియల్ పైలట్‌గానూ శిక్షణ పొందింది. ఇప్పుడు 22 ఏళ్ల వయసులో నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది.

దత్తత కుమార్తె మాటలతో ఎమోషనల్

సెప్టెంబర్ 22న ముంబయిలో జరిగిన వరల్డ్ రోజ్ డే కార్యక్రమానికి వివేక్ ఒబెరాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సహారా తాను హీరోయిన్‌గా నటిస్తున్న విషయాన్ని వెల్లడించింది. నేపాలీ సినిమాలో కథానాయికగా నటిస్తున్నానని చెప్పడంతో వివేక్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.

చిన్నప్పటి నుంచి వివేక్‌ను చూస్తూ పెరిగానని, ఆయన అడుగుజాడల్లో నడవాలని ఎప్పుడూ కోరుకున్నానని సహారా చెప్పింది. నటన, నృత్యం వంటి తన ఆసక్తులకు వివేక్ ఎప్పుడూ ప్రోత్సాహం అందించారని, అందుకే తాను పెద్ద కలలు కనగలిగానని తెలిపింది.

‘ఆ రోజు నుంచే ఆమె గెలుస్తుందని తెలుసు’

సహారా క్యాన్సర్‌తో పోరాడుతున్న రోజులను గుర్తుచేసుకున్న వివేక్.. ఆమెపై తనకున్న గర్వాన్ని వ్యక్తం చేశారు. రెండున్నరేళ్ల చిన్నారిగా క్యాన్సర్‌ను ఎదుర్కొన్న సహారాలో అప్పుడే ఎంతో పోరాట పటిమ కనిపించిందని చెప్పారు. ఆమె తప్పకుండా విజయం సాధిస్తుందని అప్పుడే అనిపించిందని పేర్కొన్నారు.

ఇప్పుడు అదే చిన్నారి తన కష్టానికి తగిన ఫలితం అందుకుంటూ హీరోయిన్‌గా మారుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని వివేక్ తెలిపారు. భావోద్వేగంతో సహారాను ఆశీర్వదించి, ఆమె నటిస్తున్న సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఇదిలా ఉంటే వివేక్ ఒబెరాయ్ ప్రస్తుతం నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’లో కీలక పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు సహారా నటిస్తున్న నేపాలీ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

By Avinash