
D News: Aug 24: ఇస్రోకు చెందిన యు.ఆర్. రావు శాటిలైట్ సెంటర్ (URSC), బెంగళూరులో 2026-27 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, కమర్షియల్ ప్రాక్టిస్ అప్రెంటిస్ విభాగాల్లో మొత్తం 410 ఖాళీలను భర్తీ చేయనున్నారు. BE/BTech, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇస్రోలో అప్రెంటిస్ శిక్షణ పొందాలనుకునే యువతకు ఇది మంచి అవకాశంగా నిలవనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 28, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు 220, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు 120, కమర్షియల్ ప్రాక్టిస్ అప్రెంటిస్ పోస్టులు 70 ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్, కెమికల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టిస్ తదితర విభాగాల్లో అప్రెంటిస్ శిక్షణకు అవకాశం కల్పించారు.
విద్యార్హతలు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి BE/BTech ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు గుర్తింపు పొందిన రాష్ట్ర బోర్డు నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
కమర్షియల్ ప్రాక్టిస్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టిస్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 2022, 2023, 2024, 2025 లేదా 2026 సంవత్సరాల్లో తమ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 2021 కంటే ముందు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు.
దరఖాస్తు విధానం
అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 28, 2026లోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా National Apprenticeship Training Scheme (NATS) పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం UMANG పోర్టల్‌లోకి వెళ్లి ‘URSC Apprenticeship’ను సెర్చ్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.
NATSలో పొందిన Enrollment/Apprenticeship Registration Numberను UMANG దరఖాస్తులో తప్పనిసరిగా నమోదు చేయాలి. BE/BTech లేదా డిప్లొమా మార్కుల మెమోలు, విద్యార్హత సర్టిఫికెట్లు, ఫొటో, సంతకం తదితర అవసరమైన పత్రాలను సూచించిన ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి.
ఎంపిక విధానం
ఈ అప్రెంటిస్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థులు తమ విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు.
స్టైపెండ్ వివరాలు
ఎంపికైన గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.12,300 స్టైపెండ్ అందిస్తారు. డిప్లొమా, టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.10,900 స్టైపెండ్ చెల్లిస్తారు. అర్హత ఉన్న అభ్యర్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
