DSports 24 Nov:చెన్నై/మధురై: హాకీ అభిమానులకు భారత హాకీ సమాఖ్య బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమిళనాడులోని చెన్నై, మధురై వేదికల్లో జరగనున్న పురుషుల ఎఫ్‌ఐహెచ్ జూనియర్ హాకీ వరల్డ్ కప్ 2025 మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రేక్షకులకు ఉచితంగా టిక్కెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

హాకీకి మరింత ప్రజాదరణ పెంచడం, క్రీడాభిమానులను మైదానాలకు రప్పించడం, ముఖ్యంగా యువ క్రీడాకారులు మరియు విద్యార్థులను ప్రోత్సహించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం.హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ మాట్లాడుతూ.. “భారత హాకీ చరిత్రలో ఇది ఒక చారిత్రక ఘట్టం. ఈ క్షణంలో ప్రతి అభిమాని భాగస్వామి కావాలని మేము కోరుకుంటున్నాము. ఉచిత టిక్కెట్లు అందించడం ద్వారా తమిళనాడుతో సహా ఇతర ప్రాంతాల నుంచి హాకీ ప్రేమికులకు అంతర్జాతీయ హాకీని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాము,” అని తెలిపారు.

ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 24 దేశాలు పాల్గొంటున్నాయి. జూనియర్ వరల్డ్ కప్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎడిషన్‌ కావడం విశేషం.ఈ మెగా టోర్నమెంట్ నవంబర్ 28వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు చెన్నై మరియు మధురైలలో జరుగుతుంది.ఉచిత టిక్కెట్లను అభిమానులు ‘టిక్కెట్ జీనీ’ వెబ్‌సైట్ లేదా హాకీ ఇండియా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, అభిమానులకు డిజిటల్ టిక్కెట్ లభిస్తుంది. దీనిని ఉపయోగించి వారు సులభంగా స్టేడియంలోకి ప్రవేశించవచ్చు.

ఆతిథ్య భారత్ జట్టు టోర్నమెంట్‌లో పూల్-Aలో ఉంది.

భారత్ తొలి మ్యాచ్: నవంబర్ 28న చిలీ జట్టుతో.

తరువాత మ్యాచ్‌లు: నవంబర్ 29న ఒమన్తో, డిసెంబర్ 2న స్విట్జర్లాండ్‌తో తలపడనుంది.

ఈ ఉచిత టిక్కెట్ల సౌకర్యంతో తమిళనాడులో హాకీ వాతావరణం మరింత ఉత్సాహంగా మారే అవకాశం ఉంది.