
D Spiritual: Oct 22: గంభీరావుపేట: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరిస్తున్నారు.
బ్రహ్మోత్సవాల మొదటి రోజు పుణ్యవచనంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మరుసటి రోజు దేవతా ఆహ్వాన కార్యక్రమం నిర్వహించనున్నారు. శుక్రవారం స్వామివారి కల్యాణ మహోత్సవం జరగనుండగా, ఆదివారం హోమం, బలిహారాలు నిర్వహించనున్నారు.
సోమవారం స్వామివారి గరుడ మహోత్సవం వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా గరుడ వాహనంపై స్వామివారిని పురవీధుల గుండా ఊరేగించనున్నారు. మరుసటి రోజు తెల్లవారుజామున స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం జరిగే ఏకాంత సేవతో వారం రోజుల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ పాపారావుతో పాటు భక్త బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల ప్రారంభంతో లింగన్నపేట గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
