హనుమకొండ జిల్లా పరకాలలోని అమరధామం స్మారక స్థలంలో సీనియర్ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు అమరవీరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణలోని జలియన్‌వాలాబాగ్‌గా గుర్తింపు పొందిన 1947 సెప్టెంబర్ 2 పరకాల మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను ఆయన స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా అక్కడకు తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు, స్థానిక నాయకులు, ప్రజలను ఉద్దేశించి రామచందర్ రావు మాట్లాడుతూ.. భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు ప్రయత్నించినందుకు నిజాం రజాకార్ల దారుణ కాల్పుల్లో 22 మంది అమాయక గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. దేశ సమైక్యత, తెలంగాణను భారత యూనియన్‌లో విలీనం చేయాలన్న పోరాటంలో వారు చేసిన త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు.

తెలంగాణ విమోచన పోరాట చరిత్రలో పరకాల ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉందని రామచందర్ రావు అన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో తెలంగాణ విలీన పోరాటం ఒక మరచిపోలేని అధ్యాయమని తెలిపారు.

సెప్టెంబర్ 2ను చారిత్రక అమరవీరుల దినంగా అధికారికంగా గుర్తించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరులు ప్రదర్శించిన ధైర్యం, త్యాగస్ఫూర్తి నుంచి యువత ప్రేరణ పొందాలని పిలుపునిచ్చారు.

By Rajini