
D Spiritual: Sept 7: ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం క్రిష్టంశెట్టిపల్లె గ్రామంలో వెలసిన శ్రీ పోలేరమ్మ ఆలయంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆలయంలో వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా కాంచి అమ్మవారి రూపంలో అలంకరించారు.
అలంకరణ పూర్తయిన అనంతరం అమ్మవారి విగ్రహాన్ని పరిశీలించిన స్థానికులు.. సాధారణంగా కనిపించే రెండు కళ్లతో పాటు అదనంగా మరో రెండు కళ్లు స్పష్టంగా కనిపిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఈ దృశ్యానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.
ప్రత్యక్షమైన అమ్మవారంటూ భక్తుల విశ్వాసం
అమ్మవారి విగ్రహంపై అదనపు నేత్రాలు కనిపించడాన్ని భక్తులు దైవలీలగా భావిస్తున్నారు. తాము భక్తిశ్రద్ధలతో పిలిచిన వెంటనే పోలేరమ్మ తల్లి పలికి, ఈ రూపంలో ప్రత్యక్షమై తమను ఆశీర్వదిస్తోందని భక్తులు విశ్వసిస్తున్నారు.
ఈ విశేష దృశ్యాన్ని కళ్లారా చూసి అమ్మవారి దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో క్రిష్టంశెట్టిపల్లె పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయంలో భక్తుల రద్దీ పెరగడంతో దర్శనం, ప్రత్యేక పూజలకు సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు చేపట్టారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ పూజారి తెలిపారు. అమ్మవారి మహిమను స్మరిస్తూ గ్రామంలో వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
