
DNews: Feb02: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పెద్ద ఊరట లభించింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మనీలాండరింగ్ అంశంలో దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), చంద్రబాబు నాయుడుకు క్లీన్ చిట్ ఇచ్చింది.
2014-19 మధ్య ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్… ఆంధ్రప్రదేశ్ అంతటా 40 నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో సీమెన్స్, డిజైన్ టెక్ సిస్టమ్స్ వంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. యువతకు సాంకేతిక శిక్షణ అందించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. అయితే, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.371 కోట్లు దుర్వినియోగం జరిగిందని ఆరోపించింది. ఈ విషయంలో కేసు నమోదు చేసిన సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చారు… సెప్టెంబర్ 9, 2023న సీఐడీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. దీనిపై టీడీపీ ఏసీబీ కోర్టు, హైకోర్టులో న్యాయ పోరాటం చేసింది. అయితే, హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత… 2023 అక్టోబర్ 31 వరకు దాదాపు 53 రోజుల తర్వాత చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత కూడా గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు బెంచ్ కొట్టివేసింది. దీనితో చంద్రబాబుకు ఉపశమనం లభించింది.
ఈ కేసులో, చంద్రబాబు నాయుడుతో సహా 37 మంది నిందితులను అభియోగాల నుండి నిర్దోషులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
