
DNews: May 08: హనుమకొండలోని కళోజి కళాక్షేత్రంలో శుక్రవారం ప్రాజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన మెగా జాబ్ ఫేర్‌లో మంత్రి కొండ సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, కుడా చైర్మన్ ఇనగల వెంకట్రెడ్డి, కలెక్టర్ సత్యశరదా దేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నిరుద్యోగులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారకూడదని హెచ్చరించారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని, మహిళలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సమాజంలో ప్రస్తుత తరం అనేక మార్పులు చూసిందని, తప్పు చేయని వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.
ఎంపీ కడియం కావ్య యువత ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని, నిరంతరం ప్రయత్నాలు కొనసాగించాలని సూచించారు. కష్టపడి పనిచేస్తే జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవచ్చని చెప్పారు.
ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు (AI) వచ్చాక అనేక ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని, పోటీని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. తెలంగాణ యువత సైన్యంలో ప్రాతినిధ్యం తక్కువగా ఉందని, ప్రతిభతోనే ఉద్యోగాలు సాధ్యమవుతాయని అన్నారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో రాణించడానికి నైపుణ్యాలు అవసరమని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు కష్టపడాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
ఈ జాబ్ ఫేర్‌లో నాయకులు యువతకు మార్గదర్శకత్వం ఇచ్చి, కృషి, ప్రతిభ, నైపుణ్యాల ద్వారా భవిష్యత్తు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.
