
D News: Sept 12: ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10 వేలకు పైగా పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఈ నెల 15న షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
గ్రూప్స్, పోలీస్, డీఎస్సీతో పాటు పలు కీలక విభాగాల్లో ఉన్న ఖాళీల వివరాలను ఈ షార్ట్ నోటిఫికేషన్లో పొందుపరచనున్నారు. అలాగే ఆయా పోస్టులకు సంబంధించిన పరీక్షల ప్రాథమిక షెడ్యూల్ను కూడా వెల్లడించనున్నట్లు సమాచారం.
ఈ షార్ట్ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఖాళీలపై స్పష్టత రానుంది. అంతేకాకుండా పరీక్షల ప్రాథమిక షెడ్యూల్ ముందుగానే తెలియడంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్ను పక్కా ప్రణాళికతో కొనసాగించేందుకు అవకాశం లభిస్తుంది.
షార్ట్ నోటిఫికేషన్ అనంతరం అక్టోబర్ మొదటి వారంలో ఏపీపీఎస్సీ పూర్తిస్థాయి నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. ఇందులో ప్రతి పోస్టుకు సంబంధించిన సమగ్ర సిలబస్, విద్యార్హతలు, రిజర్వేషన్ నిబంధనలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం తదితర వివరాలను స్పష్టంగా వెల్లడించనున్నారు.
మరోవైపు నియామక పరీక్షల నిర్వహణపై కూడా ఏపీపీఎస్సీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలను మాన్యువల్ విధానంలో, అంటే ఓఎంఆర్/ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మిగిలిన సాంకేతిక, సాధారణ పోస్టులకు సంబంధించిన పరీక్షలను ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)గా నిర్వహించేందుకు కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. పోస్టుల సంఖ్య, పరీక్షల షెడ్యూల్, సిలబస్, అర్హతలు వంటి పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.
10 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ వేగవంతం కావడంతో రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆశలు పెరిగాయి. షార్ట్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అభ్యర్థులు పోస్టుల వారీగా వివరాలను పరిశీలించి, పరీక్షలకు ముందుగానే సిద్ధం కావడం మంచిది.
