
DNews: Dec27:రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలనే గొప్ప ఆశయంతో అమలు చేస్తున్న పథకం స్త్రీ శక్తి. ఈ పథకం ద్వారా చాలా మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకం అమలులో నిధుల కొరత లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. స్త్రీ శక్తి పథకానికి ఇప్పటికే కేటాయించిన నిధులకు అదనంగా మరో రూ.800 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్త్రీ శక్తి అమలు కోసం ఈ ఏడాది నవంబర్ నుండి 2026 మార్చి వరకు నెలకు రూ.160 కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ ఏడాది ఆగస్టు 15న ప్రభుత్వం అధికారికంగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అక్టోబర్ వరకు రూ.400 కోట్లు విడుదలయ్యాయి. నిధుల విడుదల పట్ల అన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఆర్టీసీ ఎన్ఎంయూఏ, ఎంప్లాయీస్ యూనియన్, కార్మిక పరిషత్ నాయకులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
