
D Edu: Jul 9: JNVST 6వ తరగతి అడ్మిషన్స్ 2027: జులై 31 వరకు దరఖాస్తులు.. ఉచిత విద్యకు సువర్ణావకాశం
దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNVs) 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష (JNVST-2027) ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు 2026 జులై 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం 665 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 15 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ప్రతి ఏడాది నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి, వారికి 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పూర్తిగా ఉచిత విద్య అందిస్తారు. అలాగే బాలురు, బాలికలకు వేర్వేరు హాస్టల్, వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తారు.
దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా సంబంధిత జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న జిల్లాకు చెందిన నివాసులై ఉండాలి. అలాగే 2026-27 విద్యా సంవత్సరంలో అదే జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
నవోదయ విద్యాలయాల్లో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. మొత్తం సీట్లలో మూడో వంతు బాలికలకు కేటాయిస్తారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తారు.
వయోపరిమితి ప్రకారం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2015 మే 1 నుంచి 2017 జులై 31 మధ్య జన్మించి ఉండాలి. అర్హత ఉన్న విద్యార్థులు 2026 జులై 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రవేశాలకు ఎలాంటి దరఖాస్తు రుసుము ఉండదు.
JNVST-2027 ప్రవేశ పరీక్షను 2026 నవంబర్ 28న నిర్వహించనున్నారు. పరీక్ష ఫలితాలు 2027 మార్చి చివరి వారంలో ప్రకటించే అవకాశం ఉంది.
ప్రవేశ పరీక్షలో మొత్తం మూడు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, అరిథ్‌మెటిక్, లాంగ్వేజ్ టెస్ట్ విభాగాల నుంచి మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు. పరీక్షకు 2 గంటల సమయం కేటాయిస్తారు.
ఈ ప్రవేశ పరీక్షను తెలుగు, ఇంగ్లిష్, హిందీతో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. దీంతో విద్యార్థులు తమకు అనుకూలమైన భాషలో పరీక్ష రాసే అవకాశం ఉంటుంది.
