
D Spiritual: Sept 18: వినాయక చవితి ఉత్సవాల వేళ అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తుండగా.. అనూహ్యంగా ఓ ఎలుక అక్కడికి వచ్చింది.
వినాయక విగ్రహం వద్దకు వచ్చిన ఆ ఎలుక కొద్దిసేపు విఘ్నేశ్వరుడి ఒడిలో, అనంతరం ఆయన పాదాల చెంత కూర్చొని కనిపించింది. సాధారణంగా మనుషులను చూడగానే పరుగులు తీసే ఎలుక.. ఈ ఘటనలో మాత్రం ఎలాంటి భయం లేకుండా వినాయకుడి వద్దే ఉండిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
విఘ్నేశ్వరుడి వాహనం మూషికం కావడంతో.. అది స్వయంగా వినాయకుడి వద్దకు వచ్చిందని విద్యార్థులు, ఉపాధ్యాయులు భావించారు. ఈ ఘటనను వారు దైవ మహిమగా భావించి భక్తితో వీక్షించారు. విద్యార్థులు భజనలు చేస్తున్న సమయంలో ఆ ఎలుక కూడా ముందు కాళ్లను పైకి ఎత్తుతూ కదలడంతో.. అది కూడా పూజల్లో పాల్గొంటున్నట్లుగా అనిపించిందని వారు తెలిపారు.
ఈ ఘటనను గమనించిన హాస్టల్ వార్డెన్ శకుంతల ఆ ఎలుకకు నమస్కరించి, దాని నుదుటన బొట్టు పెట్టారు. అయినప్పటికీ అది అక్కడి నుంచి వెళ్లకుండా ప్రశాంతంగా కూర్చుని ఉంది. పూజా కార్యక్రమాలు కొనసాగుతున్న సమయంలోనూ ఎలాంటి భయం లేకుండా అక్కడే ఉండిపోయింది.
భక్తులు సమర్పించిన నైవేద్యం, పండ్లను కూడా ఆ ఎలుక అక్కడే కూర్చుని తిన్నట్లు తెలిపారు. ఈ దృశ్యాన్ని చూసిన విద్యార్థులు స్వామివారి నామస్మరణ చేశారు. ఈ ఘటనను విఘ్నేశ్వరుడి మహిమగా భావించిన పాఠశాల ఉపాధ్యాయులు, వార్డెన్.. వినాయకుడి చెంత ఉన్న మూషికం దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆసక్తికరంగా మారింది.
