Allu Sirish Complains About Late-Night DJ Noise, Allu Arjun Dragged Into Social Media Fan War

D News:పండుగల సమయంలో ధ్వని కాలుష్యంపై హీరో అల్లు శిరీష్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి వరకు భారీ శబ్దాలతో డీజేలు, లౌడ్ స్పీకర్లు వినియోగించడంపై ఆయన హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని కొందరు నెటిజన్లు అల్లు అర్జున్‌కు ముడిపెట్టడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ మొదలైంది.

అర్ధరాత్రి వరకు డీజే సౌండ్స్

షేక్‌పేట్‌లోని అపర్ణ వన్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న అల్లు శిరీష్.. సమీపంలోని వినోభా నగర్ ప్రాంతంలో రాత్రి 2 నుంచి 3 గంటల వరకు కూడా భారీ శబ్దాలతో డీజేలు, లౌడ్ స్పీకర్లు కొనసాగుతున్నాయని తెలిపారు. దీనివల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

పోలీసులకు ఫిర్యాదు.. వెంటనే చర్యలు

వినాయక నిమజ్జనం పూర్తయ్యే వరకు ఓపిక పట్టామని, ఆ తర్వాత కూడా అర్ధరాత్రి శబ్దాలు కొనసాగడంతో పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు శిరీష్ తెలిపారు. దీనిపై స్పందించిన పోలీసులు ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ శబ్దాలకు స్థానిక ఆలయానికి సంబంధం లేదని, నిమజ్జనం సందర్భంగా బయటి వ్యక్తులు మైకులు ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం నిర్వాహకులతో మాట్లాడి కార్యక్రమాన్ని నిలిపివేశారు.

శిరీష్ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో చర్చ

తన ఫిర్యాదును కొందరు మతపరమైన అంశంగా మార్చడంపై శిరీష్ స్పందించారు. తాను కూడా హనుమంతుడి భక్తుడినేనని చెబుతూ.. అర్ధరాత్రి భారీ శబ్దాలతో డీజేలు పెట్టడం భక్తికి సంబంధించిన విషయం కాదని, ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.

మధ్యలో అల్లు అర్జున్‌ను లాగడంతో ఫ్యాన్ వార్

ఇక శిరీష్ చేసిన వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు అల్లు అర్జున్‌తో ముడిపెట్టడంతో సోషల్ మీడియాలో కొత్త వివాదం మొదలైంది. బన్నీకి సంబంధించిన పాత ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కొందరు విమర్శలు చేయగా.. అల్లు అర్జున్ అభిమానులు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ధ్వని కాలుష్యంపై మొదలైన చర్చ కాస్తా మెగా-అల్లు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్‌గా మారింది.

By Avinash