DSports 12Mar 2026:ముంబై: టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు టైటిల్ సాధించిన ఆనందంలో ఉన్నప్పటికీ, టోర్నీలో జరిగిన ఒక వివాదస్పద నిర్ణయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా స్పందించారు. జట్టు వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను ఒక కీలక మ్యాచ్‌లో పక్కన పెట్టినందుకు తన తప్పును అంగీకరిస్తూ, అతడికి క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు.

  • సూపర్-8 దశలో భాగంగా అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ అక్షర్ పటేల్‌ను కాదని వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఇది కేవలం ‘మ్యాచ్-అప్’ (ప్రత్యర్థి బ్యాటర్ల బలహీనతలను బట్టి) వ్యూహంలో భాగంగా చేసిన మార్పు అని అప్పట్లో చెప్పారు. అయితే, ఆ మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఘోరంగా ఓడిపోయింది.
  • అక్షర్ తీవ్ర ఆగ్రహం: “అక్షర్ ఆ రోజు నాపై చాలా కోపంగా ఉన్నాడు. నిజానికి అతడు కోపంగా ఉండటంలో తప్పు లేదు. అతడు ఎంతో అనుభవజ్ఞుడైన ప్లేయర్, ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నారు. అలాంటి ఆటగాడిని కీలక మ్యాచ్‌లో పక్కన పెట్టడం బాధాకరమే.”
  • సారీ చెప్పిన కెప్టెన్: “మ్యాచ్ ముగిసిన తర్వాత నేను వ్యక్తిగతంగా అతడి దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పాను. ‘అక్షర్, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. అది జట్టు కోసం తీసుకున్న నిర్ణయమే అయినా, అది ఫలించలేదు’ అని చెప్పాను.”
  • కఠినమైన సంభాషణ: ఆ సమయంలో అక్షర్‌తో మాట్లాడటం చాలా కష్టంగా అనిపించిందని, మరుసటి రోజు వరకు కూడా అతడు తనతో సరిగ్గా మాట్లాడలేదని సూర్య గుర్తు చేసుకున్నారు.