
ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో భద్రతా లోపాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. రోగులకు అత్యవసర చికిత్స అందించేందుకు ఉపయోగించే నాలుగు వెంటిలేటర్లు చోరీకి గురికావడం కలకలం రేపుతోంది. ఇద్దరు వ్యక్తులు ఈ వైద్య పరికరాలను సంచుల్లో పెట్టుకుని ఆస్పత్రి నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆస్పత్రి భద్రతా వ్యవస్థపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గత నెల 30న రిమ్స్ ఆస్పత్రిలోని రెండో అంతస్తులో ఉన్న ఆర్‌ఐసీయూ, చెస్ట్ వార్డుల నుంచి రెండేసి వెంటిలేటర్లు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. అలాగే టీబీ వార్డు నుంచి మరో రెండు వెంటిలేటర్లు చోరీకి గురైనట్లు నిర్ధారించారు. మొత్తం నాలుగు విలువైన వైద్య పరికరాలు కనిపించకుండా పోవడంతో ఆస్పత్రి వర్గాలు అప్రమత్తమయ్యాయి.
గతంలోనూ చోరీలు.. 10 మందికి మెమోలు
రిమ్స్ ఆస్పత్రిలో గతంలోనూ సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాలు చోరీకి గురైనట్లు సమాచారం. తాజాగా వెంటిలేటర్ల చోరీ ఘటన నేపథ్యంలో ఆస్పత్రి అధికారులు బాధ్యులపై చర్యలకు ఉపక్రమించారు. విధుల్లో ఉన్న వైద్యులు, భద్రతా సిబ్బంది సహా మొత్తం 10 మందికి మెమోలు జారీ చేసినట్లు తెలిసింది.
ఈ ఘటనపై రిమ్స్ డైరెక్టర్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించే అత్యవసర వైద్య పరికరాలకే భద్రత లేకపోవడంపై రోగుల బంధువులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
