
DNews: Jan 22: హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ (GHMC) భవనాలకు సంబంధించిన సమగ్ర డేటా సేకరణ ప్రక్రియను ప్రారంభించింది. జియోస్పేషియల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అన్ని విభాగాల సమాచారాన్ని జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (GIS) ఆధారంగా కోడిఫికేషన్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి భవనానికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్, ట్రేడ్ లైసెన్స్, తాగునీటి కనెక్షన్ నంబర్, విద్యుత్ కనెక్షన్ వంటి సాంకేతిక సమగ్ర సమాచారం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి భవనానికి ప్రత్యేకంగా ఒక QR కోడ్ కేటాయించబడుతుంది. ఆ QR కోడ్‌ను మొబైల్ యాప్‌లో స్కాన్ చేస్తే, ఆ భవనానికి సంబంధించిన అన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి. ఈ సౌకర్యం కోసం GHMC ఒక GIS ఆధారిత మొబైల్ యాప్‌ను రూపొందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ యాప్ ద్వారా పౌరులు తమ భవనానికి సంబంధించిన సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. అన్ని విభాగాల డేటా ఒకే క్లిక్‌తో అందుబాటులో ఉండటం వల్ల కేటగిరీలలో తేడాలు, ప్రాపర్టీ ట్యాక్స్ వ్యత్యాసాలు వంటి అంశాలను సులభంగా గుర్తించవచ్చు. అధికారులు ఈ సమాచారాన్ని పన్ను సవరణలు, కేటగిరీ మార్పులు చేయడానికి ఉపయోగించవచ్చని తెలిపారు. యాప్ రూపకల్పన కోసం GHMC త్వరలో టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గురువారం జరగబోయే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
