
DNews: Feb 18: తెలంగాణ రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై 2026-27 సంవత్సరానికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు (బుధవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఇఎన్‌సీలు మోహన్ నాయక్, జయ భారతి, సీఈలు శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, వసంత్ నాయక్, బి.వి.రావు, లింగారెడ్డి, నర్సింగ్ రావు మరియు పలువురు ఆర్&బీ అధికారులు హాజరయ్యారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత సంవత్సరం విడుదలైన నిధులు, పనుల పురోగతి, బడ్జెట్ అంశాలను సమగ్రంగా చర్చించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు మరియు భవనాల శాఖ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. వార్షిక బడ్జెట్ అంచనాలు స్పష్టమైన ప్రణాళికతో ఉండాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్ వంటి గేమ్-చేంజర్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని సూచించారు.
“2047 రైజింగ్ తెలంగాణ” నినాదంతో రాష్ట్ర రోడ్ల అభివృద్ధి ముఖ్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ‘హామ్’ రోడ్ల నిర్మాణంతో అద్దంలాంటి రోడ్లు రాష్ట్రవ్యాప్తంగా నిర్మించబడతాయని అన్నారు.
అలాగే, ప్రస్తుత అడ్డంకులను అధిగమించేందుకు కృషి చేయాలని, కేంద్ర-రాష్ట్ర నిధుల వాటా విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్-విజయవాడ (NH 65) జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర రహదారి రవాణా మంత్రి నితిన్ గడ్కరీని మరోసారి కోరతానని చెప్పారు. ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్ నుండి విజయవాడకు రెండున్నర గంటల్లో చేరుకోవచ్చని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రాజెక్టుల వేగం పెరగాలని, ఇందుకు సంబంధించి త్వరలోనే కేంద్ర మంత్రులను కలుస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.
