
DNews: Jan 28: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన నాలుగు దశాబ్దాలకుపైగా కొనసాగిన అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రశంసిస్తూ, ప్రజాసేవకుడిగా ఆయన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన అజిత్ పవార్ రాజకీయ రంగంలో ప్రతిభ కనబరిచి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని, మహారాష్ట్రలో దీర్ఘకాలం పాటు ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారని గుర్తుచేశారు. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలో గ్రామీణ ప్రాంతాలపై తన ఆధిపత్యాన్ని సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే సందర్భంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు కూడా అజిత్ పవార్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంలో ఆయన మరణించారని తెలిసి ఎంతో విచారించానని, మంచి నాయకుడిని కోల్పోవడం మహారాష్ట్రకు, దేశానికి పెద్ద నష్టమని అన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.

