
DET:OCT 18:
క్రిస్మస్ బరిలో ‘ఫంకీ’:
మాస్ కా దాస్ అని అభిమానులు పిలుచుకునే విశ్వక్ సేన్, ప్రస్తుతం ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో ‘ఫంకీ’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ముందుగా వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ, అనుకున్న దానికంటే త్వరగా సినిమా షూటింగ్ పూర్తి కావడంతో, ఈ డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
నవ్వులు పంచుతున్న టీజర్:
కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘ఫంకీ’ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్‌లో విశ్వక్ సేన్ డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అనుదీప్ మార్క్ కామెడీ సింగిల్ లైన్ పంచ్‌లు సినిమాలో వినోదం ఏ స్థాయిలో ఉండబోతుందో తెలియజేశాయి. ఈ సినిమా ఇండస్ట్రీపై ఉండే ఒక ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇందులో హీరోయిన్‌గా కయాదు లోహర్ నటిస్తోంది.
నిర్మాణ వివరాలు:
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ మరియు సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. విశ్వక్ సేన్ చివరి కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో, ‘ఫంకీ’ సినిమాతో మంచి హిట్ కొట్టి ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు. డిసెంబర్ 25న రోషన్ మేక ‘ఛాంపియన్’ లాంటి సినిమాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉండడంతో, ‘ఫంకీ’ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
