
DNews:11 OCT:మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో దసరా పండుగ వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి దుర్మరణం పాలయ్యారు.
దసరా పండుగ సందర్భంగా ఎంచగూడెం గ్రామానికి ఇటికాల నర్సయ్య, స్వాతి దంపతుల కుమారుడు రితిక్, నర్సయ్య సోదరి అనిత, శ్రీనివాస్ దంపతుల కుమారుడు జతిన్ అమ్మమ్మ ఇంటికి వచ్చారు. అయితే, కుటుంబంలో ఒక బంధువు మరణించడంతో, ఇంట్లో ఉన్న పెద్దలందరూ వేరే గ్రామానికి వెళ్లారు.
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో, రితిక్, జతిన్ ఇద్దరూ కలిసి గ్రామ శివార్లలో ఉన్న ఒక వ్యవసాయ బావి వద్దకు బహిర్భూమికి వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు ఇద్దరూ అదుపుతప్పి బావిలో పడిపోయారు. నీటిలో మునిగిపోయి చిన్నారులు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
బావిలో పిల్లలు తేలియాడడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. కొత్తగూడ ఎస్ఐ రాజ్ కుమార్ తన సిబ్బందితో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు రితిక్, జతిన్ మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు.
కేవలం కొద్ది రోజుల ఆనందం కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఇద్దరు పిల్లలు మరణించడంతో వారి తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంచగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
