D Spiritual: Nov 24: భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు

శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనం, కల్యాణ మహోత్సవం వీక్షణ, ఇతర సౌకర్యాల విషయంలో తగిన చర్యలు తీసుకున్నారు. ఈవో శంకర్ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. స్వామివారి దర్శనం, కల్యాణ మహోత్సవ నిర్వహణలో అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ కార్యక్రమాలు సజావుగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించారని పేర్కొన్నారు. ఆలయ సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా వేడుకలను నిర్వహించడంతో పాటు భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడించారు. ఉత్సవ నిర్వహణలో గ్రామపంచాయతీ పాలకవర్గం కూడా తమ వంతు సహకారం అందించింది.

భక్తుల భద్రతకు పోలీసుల పటిష్ట బందోబస్తు!

కల్యాణ మహోత్సవానికి వివిధ జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఏసీపీ జి. కృష్ణ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై నాయిని మధుకర్‌తో పాటు పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. భక్తుల రాకపోకలను క్రమబద్ధీకరించడం, వాహనాల రద్దీని నియంత్రించడం, ఆలయ పరిసరాల్లో శాంతిభద్రతలను పరిరక్షించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించారు.

ఆధ్యాత్మిక శోభతో కళకళలాడిన దేవునిపల్లి!

దేవాదాయ శాఖ అధికారుల సమన్వయం, గ్రామపంచాయతీ పాలకవర్గం సహకారం, పోలీసుల పటిష్ట బందోబస్తు నడుమ దేవునిపల్లిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. వేలాదిమంది భక్తుల రాకతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. స్వామివారి దివ్య కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నాదాలు, భక్తుల జయజయధ్వానాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన కల్యాణ వేడుకలు భక్తులకు కనులపండువగా నిలిచాయి. మొత్తంగా భక్తుల విశేష రాకతో దేవునిపల్లి ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *