D Spiritual: Nov 23: యాదగిరిగుట్టలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి మూడు గంటల సమయం

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం సెలవుదినం కావడంతో యాదాద్రి నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు ముందుగా పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ పరిసరాలను సందర్శిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.

సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

యాదగిరిగుట్ట దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తులు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలు విశేషంగా నిర్వహించారు. కుటుంబసమేతంగా ఆలయానికి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం

ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఉచిత దర్శనానికి సుమారు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పట్టినట్లు తెలుస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కుటుంబసమేతంగా వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.

టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాల బారులు

కార్తీక మాసం, శుభకార్యాల నేపథ్యంలో యాదాద్రికి భక్తుల రాక పెరగడంతో జిల్లాలోని టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ఆలయ సమీపంలో కార్లు, ఇతర వాహనాలు బారులు తీరాయి.

మరోవైపు, యాదాద్రి నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన భక్తులతో బీబీనగర్ టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాల సంఖ్య రెట్టింపు కావడంతో టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *