
D Spiritual: Nov 23: భద్రాద్రిలో వైభవంగా గోదావరి హారతి
గత జిల్లా కలెక్టర్ చొరవతో భద్రాద్రి దివ్యక్షేత్రంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న గోదావరి హారతి కార్యక్రమం భక్తుల ఆదరణతో అంగరంగ వైభవంగా కొనసాగుతోందని అర్ధరాత్రి పురోహితుల సంఘం అధ్యక్షుడు రామవజ్జల రవికుమార్ తెలిపారు.
ఆదివారం గోదావరి స్నాన ఘట్టాల వద్ద నిర్వహించిన గోదావరి హారతి కార్యక్రమంలో ముందుగా గణపతి పూజ నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామివారికి, గోదావరి మాతకు అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించి, ప్రత్యేకంగా దివ్య హారతులు సమర్పించారు.
లోక కల్యాణార్థం, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శ్రీ సీతారామచంద్రస్వామివారిని, గోదావరి మాతను ప్రార్థించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు రవికుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పురోహితులు రాయప్రోలు సత్యప్రసాద్ శర్మ, బుక్కపట్నం రామాచార్యులు, చంద్రశేఖర శర్మ, తేజ శర్మ, శివ, వీహెచ్పీ నాయకుడు తిరుపతిరావు, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొని గోదావరి మాతకు, శ్రీ సీతారామచంద్రమూర్తికి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరై గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం రవికుమార్, లక్ష్మీదంపతులు, రామాచార్యులు, పీఎస్ఎన్ రెడ్డి దంపతులు సమర్పించిన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. చివరగా శాంతి మంత్ర పఠనంతో గోదావరి హారతి కార్యక్రమం ముగిసిందని రవికుమార్ తెలిపారు.
