
1. ముందుగా మట్టిని సిద్ధం చేసుకోండి
బంగాళాదుంపల సాగులో మట్టి ఎంపిక చాలా ముఖ్యం. దుంపలు భూమిలో సులభంగా పెరగాలంటే మట్టి గట్టిగా కాకుండా మెత్తగా, గుల్లగా ఉండాలి. ఇందుకోసం 50 శాతం తోట మట్టి, 40 శాతం పేడ ఎరువు, 10 శాతం ఇసుక తీసుకుని బాగా కలపాలి. ఇలా తయారుచేసిన మట్టి మిశ్రమం దుంపల ఎదుగుదలకు అనుకూలంగా ఉంటుంది. కుండీలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం కూడా ముఖ్యం.
2. సరైన కుండీని ఎంచుకోండి
ఆలుగడ్డలు పెంచడానికి వెడల్పుతో పాటు తగినంత లోతు ఉన్న పెద్ద కుండీని ఎంచుకోవాలి. కుండీ అడుగున నీరు బయటకు వెళ్లేందుకు రంధ్రాలు ఉండాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మట్టి మిశ్రమాన్ని కుండీలో సగం వరకు మాత్రమే నింపాలి. మొత్తం కుండీని మట్టితో నింపకూడదు. ఎందుకంటే మొక్క పెరిగే కొద్దీ కాండం చుట్టూ అదనంగా మట్టి వేయాల్సి ఉంటుంది. అందుకోసం కుండీలో కొంత ఖాళీ స్థలం ఉంచాలి.
3. మొలకెత్తిన బంగాళాదుంపలను నాటండి
సాగు కోసం మొలకలు వచ్చిన బంగాళాదుంపలను ఎంచుకోవాలి. కుండీలోని మట్టిలో సుమారు 5 నుంచి 10 సెంటీమీటర్ల లోతులో చిన్న గుంతలు తీసి, వాటిలో మొలకెత్తిన దుంపలను ఉంచాలి. అనంతరం వాటిపై పలుచగా మట్టి కప్పి కొద్దిగా నీరు పోయాలి. మట్టిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. బంగాళాదుంపల మొక్కలు సుమారు 17 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో చక్కగా పెరుగుతాయి. అందుకే చల్లని వాతావరణం ఉండే నవంబర్ నెల వీటి సాగుకు అనుకూలంగా ఉంటుంది.
4. ఎరువులు వేయడం మర్చిపోవద్దు
మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే తగిన పోషకాలు అందించాలి. బంగాళాదుంపలను నాటిన 10 నుంచి 15 రోజుల తర్వాత సేంద్రియ ఎరువును వేయాలి. ఇందుకోసం పేడ ఎరువు లేదా వర్మీకంపోస్ట్ ఉపయోగించవచ్చు. వీటిని మట్టిలో కలిపి మొక్క మొదలులో వేయాలి. నాటిన సుమారు 30 రోజుల తర్వాత మరోసారి ఎరువు అందించాలి. ఇలా క్రమం తప్పకుండా పోషకాలు అందించడం వల్ల మొక్కలు బలంగా పెరిగి దుంపలు ఏర్పడటానికి సహాయపడుతుంది.
5. దుంపలు ఎప్పుడు కోయాలి?
సాధారణంగా బంగాళాదుంపలు పూర్తిగా ఎదిగి కోతకు రావడానికి సుమారు 60 నుంచి 70 రోజుల సమయం పడుతుంది. మొక్క పైభాగంలోని ఆకులు క్రమంగా పసుపు రంగులోకి మారి ఎండిపోవడం ప్రారంభిస్తే దుంపలు కోతకు సిద్ధమవుతున్నాయని అర్థం. అప్పుడు కుండీలోని మట్టిని జాగ్రత్తగా తొలగించి బంగాళాదుంపలను బయటకు తీయవచ్చు.
ఇంట్లోనే తాజా ఆలుగడ్డలు!
ఇలా కొన్ని సులభమైన పద్ధతులు పాటిస్తే పెద్ద స్థలం అవసరం లేకుండానే మీ ఇంటి బాల్కనీలో బంగాళాదుంపలను పండించుకోవచ్చు. సరైన కుండీ, అనువైన మట్టి, తగినంత నీరు, సేంద్రియ ఎరువులతో ఇంటి దగ్గరే తాజా ఆలుగడ్డల సాగును ప్రారంభించవచ్చు. గార్డెనింగ్పై ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి అనుభవంగా కూడా ఉంటుంది.
