D Spiritual: Nov 21: ఖానాపూర్ గోదావరి తీరంలో వైభవంగా గంగా హారతి.. భక్తులతో కిటకిటలాడిన నదీ తీరం

ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఉత్తరవాహినిగా ప్రవహించే గోదావరి నదీ తీరంలో శుక్రవారం రాత్రి గంగా హారతి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు, మహిళలు, పెద్దలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నదీమతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దీపాలు వెలిగిస్తూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

ఈ సందర్భంగా యజ్ఞాచార్యులు శ్రీమాన్ చక్రపాణి నరసింహమూర్తి, ప్రముఖ పండితులు నిమ్మగడ్డ సందీప్ శర్మ పాల్గొని భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించారు. వారు మాట్లాడుతూ మానవ జీవితంతో గోదావరి నదికి విడదీయరాని అనుబంధం ఉందని పేర్కొన్నారు. మన సంస్కృతి, నాగరికత, జీవన విధానాలు నదుల చుట్టూనే అభివృద్ధి చెందాయని వివరించారు. పుణ్యనదులను పూజించడంతో పాటు వాటిని కాలుష్యం బారి నుంచి కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.

అలాగే జననం నుంచి మరణం వరకు సాగే మానవ జీవిత ప్రయాణంలో ప్రతి ఒక్కరూ దైవచింతన, భక్తిభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అజ్ఞానమనే చీకటిని పారద్రోలేందుకు వెలిగించే చిన్న జ్ఞానదీపం ఎంతటి వెలుగును ప్రసాదిస్తుందో, దైవభక్తి కూడా మన జీవితానికి అంతటి మార్గదర్శకత్వాన్ని అందిస్తుందని ఆధ్యాత్మిక సందేశాన్ని ఇచ్చారు.

వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ గోదావరి మాతకు నిర్వహించిన మహా హారతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మహిళలు గోదావరి నదీ తీరంలో దీపాలను వదులుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీపాల వెలుగులతో గోదావరి తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్, హిందూ ఉత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బుక వెంకటేశ్వర్లు, అధ్యక్షులు మంత్రరాజ్యం సురేష్, కౌన్సిలర్ పొలంపెల్లి రమేష్, దేవస్థానం అధ్యక్షులు అడ్డగట్ల రాజన్న, స్థానిక ఆధ్యాత్మికవేత్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *