
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ ఎట్టకేలకు సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. ఎన్నో వాయిదాలు, చర్చల అనంతరం ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) U/A 16+ సర్టిఫికెట్ జారీ చేసింది. విశేషమేమిటంటే.. ఎలాంటి కట్స్ సూచించకుండానే సినిమాకు అనుమతి లభించింది. ఈ విషయాన్ని సెన్సార్ బోర్డు వివరాలు వెల్లడించాయి. సినిమా మొత్తం నిడివి 2 గంటల 34 నిమిషాల 12 సెకన్లుగా ఖరారైంది.
సైనికుడి పోరాటం.. కుటుంబం కోసం భార్య తపన
దేశాన్ని రక్షించేందుకు సరిహద్దుల్లో పోరాడే సైనికాధికారి జీవితంతో పాటు, ఆయన కుటుంబాన్ని కాపాడుకోవడానికి భార్య చేసే ప్రయత్నాలను కూడా ఈ చిత్రంలో చూపించనున్నారు. యుద్ధభూమిలో దేశం కోసం పోరాడే భర్తకు అండగా నిలుస్తూ, ఇంటి బాధ్యతలను మోసే భార్య పాత్రకు కూడా కథలో ప్రాధాన్యం ఉండనుంది.
‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ నుంచి ‘మాతృభూమి’గా..
ఈ సినిమాను తొలుత ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ పేరుతో ప్రకటించారు. 2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే 2026 మార్చిలో చిత్రబృందం టైటిల్‌ను ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’గా మార్చింది. ఈ క్రమంలో కథలోనూ మార్పులు చేశారంటూ ప్రచారం జరగగా, సల్మాన్ ఖాన్ వాటిని ఖండించారు. సెన్సార్ బోర్డుతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలు సినిమాను పరిశీలించిన తర్వాత ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని, ఒక్క కట్ కూడా లేకుండా సర్టిఫికెట్ వచ్చిందని ఆయన గతంలో వెల్లడించారు.
డిసెంబర్ 4న థియేటర్లలోకి..
అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్‌తో పాటు చిత్రాంగద సింగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తొలుత నవంబర్ 20న విడుదల చేయాలని భావించినప్పటికీ, కొన్ని కారణాలతో వాయిదా పడింది. తాజాగా డిసెంబర్ 4, 2026న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. సెన్సార్ క్లియరెన్స్ కూడా పూర్తవడంతో సినిమా విడుదలకు మరో కీలక అడ్డంకి తొలగినట్లయింది.
