బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపును అందుకున్నారు. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ మ్యాగజీన్ ‘వెరైటీ’ ప్రకటించిన ‘ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్ టైమ్’ జాబితాలో ఆయనకు చోటు లభించింది. ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో షారుఖ్ 92వ స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 100 మంది సినీ తారల్లో చోటు సంపాదించిన ఏకైక భారతీయ నటుడు కావడం విశేషం.

హాలీవుడ్ దిగ్గజాల కంటే ముందున్న కింగ్ ఖాన్

ఈ జాబితాలో షారుఖ్ ఖాన్ పలువురు ప్రముఖ హాలీవుడ్ నటులను వెనక్కి నెట్టారు. జోక్విన్ ఫీనిక్స్ 93వ స్థానంలో, ఎమ్మా స్టోన్ 94వ స్థానంలో, ఫిలిప్ సేమౌర్ హాఫ్‌మన్ 95వ స్థానంలో, ఎడ్డీ మర్ఫీ 96వ స్థానంలో ఉన్నారు. సిల్వెస్టర్ స్టాలోన్ 99వ స్థానాన్ని దక్కించుకున్నారు. వీరందరి కంటే షారుఖ్ ముందుండటం ఆయన అంతర్జాతీయ గుర్తింపుకు నిదర్శనంగా నిలుస్తోంది.

‘దేవదాస్’కు ప్రత్యేక ప్రస్తావన

షారుఖ్ ఖాన్ సినీ ప్రయాణాన్ని వివరిస్తూ వెరైటీ ఆయన నటించిన ‘దేవదాస్’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. కెరీర్ ప్రారంభంలో ‘బాజీగర్’, ‘డర్’ వంటి సినిమాల్లో ప్రతికూల ఛాయలున్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన.. ఆ తర్వాత ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’, ‘దేవదాస్’ వంటి చిత్రాలతో రొమాంటిక్ హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని పేర్కొంది. నాలుగు దశాబ్దాలుగా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడిగా ఆయన ప్రయాణాన్ని కొనియాడింది.

జాబితాలో అగ్రస్థానంలో మార్లిన్ మన్రో

వెరైటీ ప్రకటించిన ఈ జాబితాలో హాలీవుడ్ గ్లామరస్ తార మార్లిన్ మన్రో మొదటి స్థానంలో నిలిచారు. ప్రముఖ నటుడు హంఫ్రీ బోగార్ట్ రెండో స్థానాన్ని, దిగ్గజ హాస్యనటుడు చార్లీ చాప్లిన్ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. జాక్ నికల్సన్ నాలుగో స్థానంలో, కాథరిన్ హెప్బర్న్ ఐదో స్థానంలో నిలిచారు. ప్రపంచ సినీ రంగంలోని దిగ్గజాలతో పాటు ప్రస్తుత తరం నటీనటులకు కూడా ఈ జాబితాలో చోటు కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *