1. 20–30 ఏళ్ల వయసు: ఆరోగ్యకరమైన అలవాట్లకు పునాది

20, 30 ఏళ్ల వయసులో చాలామంది బయట ఆహారానికి అలవాటు పడుతుంటారు. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి అలవాట్లు కూడా ఈ దశలోనే మొదలవుతాయి. అందుకే ఈ వయసు నుంచే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్ పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. గుడ్లు, చికెన్, చేపలు, పాలు, పెరుగు, బీన్స్, పప్పులు, రాజ్మా, శనగలు తీసుకోవాలి. వీటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, శారీరకంగా చురుకుగా ఉండటం అలవాటు చేసుకోవాలి.

2. 40 ఏళ్ల వయసు: గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

40 ఏళ్ల వయసులోనూ పురుషులు చురుకుగా, బలంగా ఉండగలరు. అయితే ఈ దశలో రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయులు వంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. బీన్స్, వాల్‌నట్స్, జామకాయ, వంకాయ, పాలు వంటి పోషక విలువలున్న ఆహారాలను తీసుకోవాలి. గ్రీన్ టీ, డార్క్ చాక్లెట్‌ను కూడా పరిమితంగా తీసుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.

3. 50 ఏళ్ల వయసు: కండరాలు, గుండె ఆరోగ్యానికి ప్రాధాన్యత

50 ఏళ్లు దాటిన తర్వాత శరీర జీవక్రియ వేగం క్రమంగా తగ్గుతుంది. దీంతో గతంతో పోలిస్తే శరీరానికి అవసరమయ్యే కేలరీల పరిమాణం తగ్గవచ్చు. ఈ సమయంలో కండరాల బలాన్ని కాపాడుకోవడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం తగినంత ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు అందించే ఆహారాన్ని తీసుకోవాలి. సాల్మన్ వంటి కొవ్వు చేపలు, ఇతర పోషక విలువలున్న ఆహారాలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి. కేలరీలు తగ్గించినా పోషకాల విషయంలో రాజీ పడకూడదు.

4. 60 ఏళ్లు పైబడిన వారు: కండరాల బలాన్ని కాపాడుకోవాలి

వయసు పెరిగే కొద్దీ పురుషుల్లో కండరాల పరిమాణం, బలం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో ‘సార్కోపెనియా’ అంటారు. దీనివల్ల శరీర సమతుల్యత దెబ్బతినడంతో పాటు నడవడం, రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టమవుతుంది. అందుకే 60 ఏళ్లు దాటిన వారు ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. కొవ్వు తక్కువగా ఉండే పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, పప్పులు వంటి ఆహారాలను తీసుకోవాలి. వయసుకు తగిన శారీరక వ్యాయామం చేయడం కూడా కండరాల బలాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

గమనిక: వయసు పెరిగే కొద్దీ ఆహార అవసరాలు మారుతుంటాయి. కాబట్టి ప్రతి దశలోనూ శరీరానికి అవసరమైన పోషకాలను అందించే సమతుల్య ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఉంటే వయసు పెరిగినా చురుకుగా, ఆరోగ్యంగా ఉండవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *