D Spiritual: Nov 17: నాగర్ కర్నూల్: కార్తీక మాసం తొలి సోమవారం, కోటి సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దీంతో ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

కార్తీక మాసంలో ప్రత్యేక నక్షత్రంలో వచ్చే సోమవారాన్ని కోటి సోమవారంగా భావిస్తారు. ఈ రోజున శివుడిని ఆరాధించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే ఏడాది పొడవునా వచ్చే సోమవారాల్లో పూజలు చేసిన ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ నమ్మకంతో భక్తులు శివాలయాలకు తరలివచ్చి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.

నాగర్ కర్నూల్ పట్టణంలోని మార్కెట్ యార్డు శివాలయం, వీరాంజనేయ శివాలయంతో పాటు పట్టణ సమీపంలోని ఎండబెట్లలో ఉన్న భీమలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే శివలింగానికి పవిత్ర జలాలు, పంచామృతాలు, బిల్వదళాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

శివాలయాలన్నీ భక్తుల శివనామస్మరణ, పంచాక్షరీ మంత్రోచ్ఛారణలతో మారుమోగాయి. మరోవైపు మహిళా భక్తులు ఉపవాసాలు పాటిస్తూ ఆలయాల్లో దీపారాధనలు నిర్వహించారు. కార్తీక మాసంలో శివారాధనకు సోమవారానికి విశేష ప్రాధాన్యత ఉండటంతో భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *