Sabarimala Updates Ayyappa Swamy Darshan Update: శబరిమల అయ్యప్ప స్వామి మండల-మకరవిళక్కు యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి 18 పవిత్ర మెట్లపై రద్దీ నియంత్రణకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నిమిషానికి ఎంతమంది భక్తులను అనుమతించనున్నారు? పూర్తి వివరాలు తెలుసుకోండి.

శబరిమల అయ్యప్ప స్వామి మండల-మకరవిళక్కు యాత్రకు రంగం సిద్ధమైంది. 65 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేరళ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో శబరిమలలోని 18 పవిత్ర మెట్లపై రద్దీ నియంత్రణకు కీలక నిర్ణయం తీసుకున్నారు. 18 పవిత్ర మెట్లను ప్రతి నిమిషానికి కేవలం 75 మంది యాత్రికులు మాత్రమే ఎక్కేందుకు అనుమతించాలని మంత్రి కె. మురళీధరన్ తెలిపారు. రద్దీని నియంత్రించకపోతే భక్తుల క్యూ ఎట్టుమానూర్ వరకు విస్తరించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత యాత్ర ముగిసిన వెంటనే వచ్చే ఫిబ్రవరి యాత్రా కాలానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభిస్తామని వెల్లడించారు.

శబరిమల అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపారని, అందువల్లే రూ.553 కోట్ల అభివృద్ధి ప్యాకేజీకి ఆమోదం లభించిందని ప్రజాపనుల శాఖ మంత్రి పీకే బషీర్ తెలిపారు. చాలకాయం-పంపా రహదారి పునరుద్ధరణ పనులను కేవలం నెలన్నరలోనే పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఇక యాత్ర కోసం శబరిమల ఆలయం నేటి సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనుంది. తంత్రి కందరారు బ్రహ్మదాతన్ సమక్షంలో మేల్శాంతి ఈడీ ప్రసాద్ నంబూతిరి ఆలయాన్ని తెరిచి దీపం వెలిగించనున్నారు. భక్తుల సౌకర్యార్థం పంపా, సన్నిధానం వద్ద వైద్యం, తాగునీరు, పారిశుధ్యం, రవాణా వంటి సదుపాయాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

మరోవైపు, శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ఇండియా పోస్ట్ తీపి కబురు అందించింది. ఇకపై శబరిమలలో స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు అక్కడి ప్రసాదాలను తమ ఇళ్లకే తెప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఎంతో ప్రసిద్ధి చెందిన అరవణ పాయసంతో పాటు ఇతర ప్రసాదాలను కూడా దేశంలోని ఏ ప్రాంతానికైనా పోస్టు ద్వారా పంపించే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం ఇండియా పోస్ట్, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB)తో కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఈ ఏడాది మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో శబరిమల సన్నిధానంలో ప్రత్యేకంగా ‘స్వామి ప్రసాదం’ పేరుతో పార్సిల్ బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కౌంటర్ 24 గంటల పాటు పనిచేయనుంది. దేవస్వం బోర్డు నిర్వహించే అరవణ, అప్పం ప్రసాదాల పంపిణీ కౌంటర్ల పక్కనే ఈ ప్రత్యేక కేంద్రం అందుబాటులో ఉంటుంది. భక్తులు అక్కడ తమకు కావాల్సిన ప్రసాదాలను బుక్ చేసుకుంటే ఇండియా పోస్ట్ స్పీడ్ పోస్ట్ పార్సిల్ సేవ ద్వారా నేరుగా ఇంటి చిరునామాకు పంపిస్తారు. అరవణ, విభూది, పసుపు, కుంకుమ, ఆడియ శిష్టం నెయ్యి, అష్టోత్తరార్చన ప్రసాదాలను ఈ సేవ ద్వారా పొందవచ్చు.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *