D news:nov:15మన ఇంటి పెరట్లోనో, టెర్రస్ గార్డెన్‌లోనో ఎంతో ఇష్టంగా పెంచుకునే పూలు, కూరగాయల మొక్కలు ఒక్కోసారి అకస్మాత్తుగా వాడిపోతుంటాయి. ఎన్ని నీళ్లు పోసినా ఎదుగుదల లేకపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారడం, పూత రాలిపోవడం వంటి సమస్యలు తోటపని ఇష్టపడే ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తాయి. అయితే ఇలాంటి సమస్యలకు ఖరీదైన రసాయన ఎరువులే పరిష్కారం కావాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే సులభంగా లభించే పదార్థాలతో, ఎలాంటి ఖర్చు లేకుండా మొక్కలకు అవసరమైన పోషకాలను అందించే అద్భుతమైన లిక్విడ్ ఎరువును తయారు చేసుకోవచ్చు. ఈ సహజ పోషక ద్రావణం మొక్కల ఎదుగుదలకు తోడ్పడి, వాడిపోయిన మొక్కలు తిరిగి చిగురించేందుకు సహాయపడుతుంది.

కలబందలో విటమిన్లు A, C, E, B తో పాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, అమైనో ఆమ్లాలు వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మొక్కల ఎదుగుదలకు, ఆరోగ్యానికి తోడ్పడతాయి. అంతేకాకుండా మట్టిలో తేమ ఎక్కువసేపు నిలిచి ఉండేందుకు కూడా కలబంద సహాయపడుతుంది.

ఇక పాత ఆవు పిడకల్లో నత్రజని, భాస్వరం, పొటాషియం (NPK) వంటి మొక్కలకు అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి నేల సారాన్ని మెరుగుపరచడంతో పాటు మట్టిని గుల్లగా మార్చి, మొక్కల వేళ్లకు గాలి బాగా అందేలా సహాయపడతాయి.

ఎరువు తయారు చేసే విధానం

ముందుగా మూడు కలబంద ఆకులను తీసుకుని చిన్న ముక్కలుగా కోయాలి. ఆకులను కోసిన తర్వాత వాటి నుంచి వచ్చే పసుపు రంగు ద్రవం (లేటెక్స్) బయటకు వెళ్లేలా కొద్దిసేపు పక్కన పెట్టాలి.

తర్వాత ఒక బకెట్‌లో మూడు లీటర్ల నీటిని తీసుకోవాలి. అందులో తరిగిన కలబంద ముక్కలను, వాటికి సమాన పరిమాణంలో పాత ఆవు పిడకల ముక్కలను వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మూత పెట్టాలి. మూడు రోజుల పాటు నానబెట్టాలి. అయితే ప్రతిరోజూ ఒకసారి మూత తీసి కర్రతో బాగా కలపాలి.

ద్రావణాన్ని వడపోసి ఉపయోగించే విధానం

మూడు రోజుల తర్వాత మిశ్రమాన్ని బాగా కలిపి, ఆవు పిడకలను చేత్తో నలిపి ద్రావణాన్ని వడపోసుకోవాలి. మిగిలిన పిప్పిని ఎండబెట్టి మొక్కల మొదట్లో సేంద్రియ ఎరువుగా ఉపయోగించుకోవచ్చు.

తయారైన ద్రావణాన్ని నేరుగా మొక్కలకు ఉపయోగించకూడదు. ఒక లీటరు ద్రావణానికి పది లీటర్ల సాధారణ నీటిని కలిపి 1:10 నిష్పత్తిలో పలుచగా చేసుకోవాలి.

మొక్కలకు ఎలా ఉపయోగించాలి?

ఈ పోషక ద్రావణాన్ని 15 రోజులకు ఒకసారి మొక్కల మొదట్లో పోయవచ్చు. పండ్ల మొక్కలు, పూల మొక్కలు, కూరగాయల మొక్కలకు ఉపయోగించుకోవచ్చు. ఆకులపై పిచికారీ చేయాలనుకుంటే ముందుగా ఒకటి రెండు ఆకులపై పరీక్షించి, ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదని నిర్ధారించుకోవాలి.

ఇలా ఇంట్లో లభించే కలబంద, పాత ఆవు పిడకలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో సేంద్రియ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. రసాయన ఎరువులపై ఆధారపడకుండా, సహజ పద్ధతుల్లో మీ ఇంటి తోటలోని మొక్కల సంరక్షణకు ఇది ఒక ఉపయోగకరమైన మార్గం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *