D news:nov:15శీతాకాలంలో బాదం పప్పులను రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. విటమిన్‌-ఈ, ప్రొటీన్లు, ఫైబర్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉండే బాదం శరీరానికి అవసరమైన పోషకాలను, శక్తిని అందిస్తుంది. ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన బాదం పప్పుల పొట్టు తీసి తినడం వల్ల జీర్ణక్రియకు తోడ్పడటంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థ సాధారణ పనితీరుకు సహాయపడతాయి. అందుకే చలికాలంలో రోజూ ఒక గుప్పెడు బాదం పప్పులను ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యకరమైన అలవాటుగా నిపుణులు సూచిస్తున్నారు.

రోగనిరోధక శక్తికి బలం

చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో శరీర రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడం అవసరం. బాదంలో ఉండే విటమిన్‌-ఇ, యాంటీఆక్సిడెంట్లు కణాలను ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థ సాధారణ పనితీరుకు తోడ్పడతాయి.

గుండె ఆరోగ్యానికి మేలు

బాదంలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకున్నప్పుడు చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దోహదపడతాయి. అలాగే బాదంలో ఉండే మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజువారీ ఆహారంలో తగిన మోతాదులో బాదం తీసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలిలో మంచి అలవాటుగా చెప్పవచ్చు.

చర్మానికి సహజమైన తేమ, కాంతి

చలికాలంలో వీచే చల్లని గాలుల ప్రభావంతో చర్మం పొడిబారి, సహజమైన కాంతిని కోల్పోతుంది. బాదంలో సమృద్ధిగా ఉండే విటమిన్-ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మానికి అవసరమైన పోషణను అందిస్తాయి. ఇవి చర్మం మృదువుగా, తేమగా ఉండటానికి సహాయపడటంతో పాటు సహజమైన కాంతిని కాపాడతాయి.

మెదడు పనితీరుకు మేలు

బాదం తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని పెద్దలు చెప్పే మాట వెనుక పోషక విలువలు ఉన్నాయి. బాదంలో ఉండే రైబోఫ్లేవిన్, విటమిన్-ఇ, ఇతర పోషకాలు మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇవి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెదడు పనితీరును మెరుగ్గా నిర్వహించడంలో సహాయపడతాయి.

బరువు, రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ

చలికాలంలో శారీరక శ్రమ తగ్గడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో బాదం మంచి చిరుతిండిగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్, ప్రొటీన్ ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించి, తరచూ ఆకలి వేయకుండా చూస్తాయి. అలాగే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు కూడా తోడ్పడుతుంది. అయితే మధుమేహం ఉన్నవారు పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకోవాలి.

బాదం ఎలా, ఎప్పుడు తీసుకోవాలి?

బాదంను నానబెట్టి తినడం చాలామందికి అలవాటు. రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయం పొట్టు తీసి తినవచ్చు. అయితే నానబెట్టడం వల్ల బాదంలోని పోషకాలు పూర్తిగా పెరుగుతాయని చెప్పడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. రోజుకు సుమారు 20–23 బాదంపప్పులను మీ ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు. ఈ శీతాకాలంలో సమతుల్య ఆహారంతో పాటు బాదంను కూడా తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *