
D news:nov:14చలికాలం వచ్చేసింది.. ఈ సీజన్లో చర్మం, జుట్టుకు ప్రత్యేకమైన సంరక్షణ అవసరం. వాతావరణంలో తేమ శాతం తగ్గడం వల్ల చర్మం పొడిబారడం, దురద, జుట్టు నిర్జీవంగా మారడం, చివర్లు చిట్లిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడంతో పాటు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సరైన నూనెలను ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. మరి చలికాలంలో చర్మం, జుట్టు సంరక్షణకు ఉపయోగపడే ఉత్తమ నూనెలు ఏవి? వాటిని ఎలా ఉపయోగించాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆర్గాన్ ఆయిల్ (Argan Oil):
ఆర్గాన్ ఆయిల్‌ను ‘లిక్విడ్ గోల్డ్’ అని కూడా పిలుస్తారు. జుట్టు, చర్మ సంరక్షణలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ E చర్మానికి అవసరమైన పోషణను అందించడంతో పాటు తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. చర్మం మృదువుగా, ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తాయి. అలాగే జుట్టుకు ఆర్గాన్ ఆయిల్ అప్లై చేయడం వల్ల జుట్టు పొడిబారడం, చివర్లు చిట్లిపోవడం, ఫ్రిజ్జీగా మారడం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.
2. స్వీట్ ఆల్మండ్ ఆయిల్ (Sweet Almond Oil):
జుట్టు, చర్మ సంరక్షణకు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ కూడా మంచి ఎంపిక. ఇది తేలికపాటి నూనె కావడంతో చర్మంపై సులభంగా అప్లై చేసుకోవచ్చు. ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్ E పొడిబారిన చర్మానికి తేమను అందించి, మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే జుట్టుకు పోషణను అందించి, మృదుత్వంతో పాటు సహజమైన మెరుపును తీసుకురావడానికి దోహదపడుతుంది.
3. ఆలివ్ ఆయిల్ (Olive Oil):
ఆలివ్ ఆయిల్లో స్క్వాలీన్ అనే సహజ లిపిడ్ ఉంటుంది. ఇది చర్మంలో తేమను నిలుపుకోవడంతో పాటు చర్మం మృదుత్వాన్ని, సాగే గుణాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయి. ఇక జుట్టు విషయానికి వస్తే.. ఆలివ్ ఆయిల్ జుట్టుకు తేమను అందించి పొడిబారడాన్ని తగ్గిస్తుంది. జుట్టును మృదువుగా మార్చడంతో పాటు సహజమైన మెరుపును అందిస్తుంది.
4. అవకాడో ఆయిల్ (Avocado Oil):
అవకాడో ఆయిల్లో విటమిన్లు A, D, Eతో పాటు మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం, జుట్టు సంరక్షణకు ఉపయోగపడతాయి. ఈ నూనె జుట్టుకు తేమను అందించి మృదువుగా ఉంచుతుంది. అలాగే పొడిబారిన జుట్టు సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మానికి అప్లై చేయడం వల్ల పొడిబారడాన్ని తగ్గించి, తేమను నిలుపుకోవడానికి దోహదపడుతుంది.
చర్మానికి నూనె అప్లై చేసే విధానం
చర్మానికి నూనెలను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. స్నానం చేసిన తర్వాత చర్మం కొద్దిగా తడిగా ఉన్నప్పుడే నూనెను అప్లై చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల చర్మంలో తేమ నిలిచేందుకు సహాయపడుతుంది. రాత్రి నిద్రపోయే ముందు కూడా అవసరమైన మేరకు నూనెను రాసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరి చర్మతత్వం భిన్నంగా ఉంటుంది కాబట్టి, మీ చర్మానికి సరిపోయే నూనెను ఎంచుకునే ముందు చర్మ వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న కథనాలు, నివేదికల ఆధారంగా రూపొందించబడింది. ఈ సమాచారాన్ని TV9 స్వతంత్రంగా ధృవీకరించలేదు. ఏదైనా నూనెను ఉపయోగించే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. అలర్జీలు రాకుండా ముందుగా చిన్న భాగంలో ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.
