
D News: Nov 10: EPFO Pension: ఉద్యోగులకు త్వరలో శుభవార్త.. కనీస పెన్షన్ రూ.1,000 నుంచి రూ.3,000కు పెరిగే అవకాశం!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే శుభవార్త అందించే అవకాశం ఉంది. ఈ నెల 19న జరగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) అత్యవసర సమావేశంలో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కనీస పెన్షన్ పెంపుపై కీలక చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పెన్షన్ పెంపునకు సంబంధించి స్పష్టమైన నిర్ణయం వెలువడవచ్చని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రూ.1,000 నుంచి రూ.3,000కు పెరిగే అవకాశం
ప్రస్తుతం ఈపీఎస్ కింద అర్హులైన పెన్షనర్లకు కనీస పెన్షన్ నెలకు రూ.1,000గా ఉంది. దీనిని రూ.3,000కు పెంచాలని ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు చాలాకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని కనీస పెన్షన్‌ను పెంచాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెన్షన్ పెంపుతో పాటు వేతన పరిమితి పెంపు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
లక్షలాది మంది పెన్షనర్లకు ఊరట?
2014 సంవత్సరం తర్వాత ఇప్పటివరకు ఈపీఎస్ కనీస పెన్షన్‌లో ఎలాంటి మార్పు జరగలేదు. అప్పట్లో నిర్ణయించిన రూ.1,000 కనీస పెన్షన్‌తో ప్రస్తుత ఖర్చులను భరించడం కష్టంగా మారిందని పలువురు రిటైర్డ్ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కనీస పెన్షన్‌ను రూ.3,000కు పెంచాలనే డిమాండ్ మరింత బలంగా వినిపిస్తోంది.
నవంబర్ 19 సమావేశంపై ఆసక్తి
నవంబరు 19న జరగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంపై దేశవ్యాప్తంగా ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమావేశంలో కనీస పెన్షన్ పెంపునకు సంబంధించి నిర్ణయం అధికారికంగా ఖరారైతే లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది. అయితే రూ.3,000 పెన్షన్ పెంపుపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపై పెన్షనర్లలో ఉత్కంఠ నెలకొంది.
