
D Educt: Nov 10: ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీల అభివృద్ధికి సర్కారు చర్యలు.. 1,138 పాఠశాలలకు నిధులు
విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. నిర్దేశించిన సంఖ్యలో జనరల్ పుస్తకాలు చదివిన విద్యార్థులకు రీడింగ్ డిప్లొమా అందజేస్తామని ఇప్పటికే ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ.. ఈ లక్ష్యాన్ని అమలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలను బలోపేతం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 4,700 హైస్కూళ్లు ఉండగా, తొలి విడతలో 1,138 పాఠశాలల్లో లైబ్రరీలను అభివృద్ధి చేసేందుకు నిధులు విడుదల చేయనుంది.
పేరుకే గ్రంథాలయాలు..
రాష్ట్రంలోని వేలాది ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు లేదా రీడింగ్ కార్నర్లు ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో చాలా పాఠశాలల్లో అవి పేరుకే పరిమితమయ్యాయి. అనేక చోట్ల దినపత్రికలు, మ్యాగజైన్లు అందుబాటులో లేవు. ఉన్న పుస్తకాలు కూడా పరిమితంగానే ఉన్నాయి. ఇక విద్యార్థులు కూర్చుని చదువుకునేందుకు అవసరమైన కుర్చీలు, టేబుళ్లు ఉన్న పాఠశాలలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితిని మార్చి విద్యార్థుల్లో పుస్తక పఠన అలవాటును పెంపొందించాలనే ఉద్దేశంతో రీడింగ్ డిప్లొమా కార్యక్రమాన్ని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.
గ్రంథాలయ సెస్ నిధుల వినియోగం..
రీడింగ్ డిప్లొమా కార్యక్రమం విజయవంతం కావాలంటే పాఠశాలల్లో గ్రంథాలయాలను అభివృద్ధి చేయడం అవసరమని విద్యాశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గ్రంథాలయ సెస్ నిధుల్లో 5 శాతాన్ని పాఠశాలల లైబ్రరీల అభివృద్ధికి వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో తొలి విడతలో ఎంపిక చేసిన పాఠశాలల్లో అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు.
దినపత్రికలు, మ్యాగజైన్ల కొనుగోలుకు నిధులు..
ప్రభుత్వ పాఠశాలల్లోని గ్రంథాలయాలకు ప్రతినెలా దినపత్రికలు, మ్యాగజైన్లు కొనుగోలు చేసేందుకు ఒక్కో పాఠశాలకు రూ.1,000 చొప్పున కేటాయించనున్నారు. ఈ మొత్తాన్ని ఆయా పాఠశాలల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ లెక్కన ఒక్కో పాఠశాలకు 10 నెలల కాలానికి రూ.10 వేల చొప్పున అందించనున్నారు. అన్ని పాఠశాలలకు కలిపి ఏడాదికి సుమారు రూ.1.14 కోట్లు ఖర్చు చేయనున్నారు.
లైబ్రరీల మౌలిక సదుపాయాలకు రూ.1.71 కోట్లు..
పాఠశాలల్లో ఇప్పటికే ప్రత్యేక గదులు అందుబాటులో ఉన్నందున వాటికి రంగులు వేయడం, విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చుని చదువుకునేందుకు రీడింగ్ టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.1.71 కోట్లు విడుదల చేయనున్నారు. అయితే, ప్రస్తుత ధరల నేపథ్యంలో రూ.15 వేలతో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడం సాధ్యం కాదని పలువురు ప్రధానోపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. లైబ్రరీలను మెరుగ్గా అభివృద్ధి చేసేందుకు మరిన్ని నిధులు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
