Pawan Kalyan Divorce: 13-Year Marriage Ends, Actor and Anna Konidela Announce Separation in Joint Statement

Pawan Kalyan Divorce | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. తన భార్య అన్నా లెజినోవాతో వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఇద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సోమవారం రాత్రి ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయం

పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల సోమవారం అర్ధరాత్రి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తమ నిర్ణయాన్ని వెల్లడించారు. దాదాపు 13 ఏళ్ల పాటు కలిసి జీవిత ప్రయాణం సాగించిన తాము.. ఇప్పుడు పరస్పర అవగాహన, గౌరవంతో వేర్వేరు మార్గాల్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

భార్యాభర్తలుగా తమ బంధం ముగిసినప్పటికీ స్నేహితులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తామని పేర్కొన్నారు. పిల్లల ఆనందం, భవిష్యత్తు, సంక్షేమమే తమకు ఎప్పటికీ ప్రాధాన్యమని వెల్లడించారు.

ఇది పూర్తిగా వ్యక్తిగత విషయమని, తమ గోప్యతకు భంగం కలిగించకుండా అభిమానులు, శ్రేయోభిలాషులు సహకరించాలని కోరారు. ఇన్నాళ్లూ తమకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారా?

పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా విడిపోవడానికి గల కారణాలను సంయుక్త ప్రకటనలో వెల్లడించలేదు. పిల్లల సంరక్షణ, ఇతర కుటుంబపరమైన ఏర్పాట్లకు సంబంధించిన వివరాలపైనా స్పష్టత ఇవ్వలేదు.

అయితే జనసేన పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. గత కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య విడిపోవడానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. దీనిపై అధికారికంగా మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.

పవన్ కల్యాణ్‌కు ఇది మూడో వివాహం

పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంలో ఇది మూడో వివాహ బంధానికి ముగింపు కానుంది. ఆయన 1997లో విశాఖపట్నానికి చెందిన నందినిని వివాహం చేసుకున్నారు. అయితే కొంతకాలానికే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. 2008లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

ఆ తర్వాత నటి రేణు దేశాయ్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 2011లో విడిపోయి, 2012లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 2013లో అన్నా లెజినోవాను పవన్ కల్యాణ్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు పోలేనా అంజనా పవనోవా, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

తాజాగా అన్నా లెజినోవాతోనూ విడిపోవాలని నిర్ణయించుకోవడంతో పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ పరిణామంపై రాజకీయ, సినీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ చర్చ మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *