Palolem Beach: ఆసియాలోనే బెస్ట్ బీచ్‌గా గోవా పాలొలెమ్‌.. ఈ బీచ్‌ ప్రత్యేకతలు తెలిస్తే వెళ్లాల్సిందే!

D news:nov:9గోవాలోని అందమైన పాలొలెమ్‌ బీచ్‌ 2026 గ్లోబల్‌ బీచ్‌ ఇండెక్స్‌లో ఆసియాలోనే అత్యుత్తమ బీచ్‌గా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఆరో స్థానాన్ని కైవసం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ నేపథ్యంలో పాలొలెమ్‌ బీచ్‌ ప్రకృతి అందాలు, ప్రత్యేక ఆకర్షణలు, పర్యాటకులు ఆస్వాదించగల కార్యకలాపాలు, చేరుకునే మార్గాలు, సందర్శనకు అనువైన సమయం వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

దక్షిణ గోవాలో ఉన్న పాలొలెమ్‌ బీచ్‌ తన సహజసౌందర్యంతో పర్యాటకులను కట్టిపడేస్తుంది. చంద్రవంక ఆకారంలో విస్తరించిన ఈ బీచ్‌కు ఇరువైపులా కొండలు, చుట్టూ పచ్చని కొబ్బరి చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రశాంతంగా ఉండే సముద్రపు నీరు ఈతకు అనుకూలంగా ఉంటుంది. సమీపంలోని చిన్న దీవులు, బ్యాక్‌వాటర్స్‌ ఈ ప్రాంత అందాన్ని మరింత పెంచుతాయి.

ఇక్కడి మరో ప్రత్యేక ఆకర్షణ ‘సైలెంట్‌ నాయిస్‌ డిస్కో’. ప్రతి శనివారం రాత్రి నిర్వహించే ఈ కార్యక్రమంలో పర్యాటకులు హెడ్‌ఫోన్లు ధరించి, తమకు నచ్చిన సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్‌ చేస్తారు. ఈ వినూత్న అనుభవం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

పాలొలెమ్‌ బీచ్‌కు వెళ్లినవారు కేవలం సముద్ర అందాలను ఆస్వాదించడమే కాకుండా ఎన్నో వినోద కార్యక్రమాల్లోనూ పాల్గొనవచ్చు.

సాయంత్రం వేళ బీచ్‌ వెంబడి నడుస్తూ సూర్యాస్తమయ అందాలను ఆస్వాదించవచ్చు.

సమీపంలోని బ్యాక్‌వాటర్స్‌లో కయాకింగ్‌ చేస్తూ ప్రకృతి అందాలను వీక్షించవచ్చు.

బీచ్‌ సమీపంలోని మంకీ ఐలాండ్‌కు ప్యాడిల్‌ బోట్‌పై వెళ్లవచ్చు.

ప్రశాంతమైన వాతావరణంలో యోగా, ధ్యానం వంటి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు.

ఉదయం వేళల్లో నిర్వహించే బోట్‌ టూర్ల ద్వారా డాల్ఫిన్‌లను చూసే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా సమీపంలోని అగోండా, పట్నెమ్‌ బీచ్‌లు, కోటిగావో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని కూడా సందర్శించవచ్చు. దక్షిణ గోవాలోని పర్యాటక ప్రాంతాలను చుట్టి రావడానికి పాలొలెమ్‌ మంచి కేంద్రంగా ఉంటుంది.

డబోలిమ్‌ విమానాశ్రయం నుంచి పాలొలెమ్‌ బీచ్‌ సుమారు 60-65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విమానాశ్రయం నుంచి ట్యాక్సీ ద్వారా చేరుకోవచ్చు.

కనకోణ రైల్వే స్టేషన్‌ పాలొలెమ్‌కు సమీపంలో ఉంటుంది. అక్కడి నుంచి ఆటో లేదా ట్యాక్సీలో బీచ్‌కు వెళ్లవచ్చు. మార్గావ్‌, కనకోణ ప్రాంతాల నుంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ట్యాక్సీలు, ప్రైవేట్‌ వాహనాల ద్వారా కూడా చేరుకోవచ్చు.

నవంబర్‌ నుంచి మార్చి వరకు పాలొలెమ్‌ బీచ్‌ను సందర్శించడానికి అనువైన కాలం. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు బీచ్‌ అందాలను ఆస్వాదించేందుకు అనుకూలంగా ఉంటుంది. అయితే క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల సమయంలో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ సమయంలో పర్యటనకు వెళ్లాలనుకునేవారు హోటళ్లు, రవాణా సదుపాయాలను ముందుగానే బుక్‌ చేసుకోవడం మంచిది.

సహజసౌందర్యం, ప్రశాంతమైన సముద్రతీరం, వినోద కార్యక్రమాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో పాలొలెమ్‌ బీచ్‌ గోవా పర్యటనలో తప్పక సందర్శించాల్సిన ప్రాంతంగా నిలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *