అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న తెలంగాణకు చెందిన యువతి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. నల్గొండ జిల్లాకు చెందిన 23 ఏళ్ల కోయ సృజా రెడ్డి అమెరికాలోని బోస్టన్‌లో కనిపించకుండా పోయింది. నవంబర్ 2న రాత్రి వాకింగ్‌కు వెళ్లిన ఆమె తిరిగి గదికి రాలేదు. ఐదు రోజులుగా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బోస్టన్ పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సృజా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ బోస్టన్‌లో మాస్టర్స్ చదువుతోంది. ఉన్నత చదువుల కోసం సుమారు ఏడాదిన్నర క్రితం అమెరికాకు వెళ్లింది. చదువుతో పాటు పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేస్తోంది.

నవంబర్ 2న రాత్రి నుంచి కనిపించకుండా..
సృజా రెడ్డి నల్గొండ జిల్లా కనగల్ మండలం శబ్దుల్లాపురం గ్రామానికి చెందిన యువతి. నవంబర్ 2న కాలేజీకి వెళ్లి తిరిగి తన నివాసానికి చేరుకుంది. అనంతరం రాత్రి సమయంలో వాకింగ్‌కు బయటకు వెళ్లింది. అయితే ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆమె స్నేహితులు ఆందోళన చెందారు.
ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నవంబర్ 3న పోలీసులకు ఫిర్యాదు చేయగా, నవంబర్ 4న బోస్టన్ పోలీస్ డిపార్ట్మెంట్ మిస్సింగ్ పర్సన్ అలర్ట్ జారీ చేసింది.
కార్సన్ బీచ్, హార్బర్ పాయింట్ ప్రాంతాల్లో గాలింపు
బోస్టన్ పోలీసులు విడుదల చేసిన వివరాల ప్రకారం.. సృజా రెడ్డి ఎత్తు సుమారు 5 అడుగుల 3 అంగుళాల నుంచి 5 అడుగుల 5 అంగుళాల మధ్య ఉంటుంది. నల్లటి జుట్టు, సన్నటి శరీరాకృతి కలిగి ఉంటుంది. చివరిసారిగా నల్లటి జాకెట్, జీన్స్ ధరించి కనిపించినట్లు పోలీసులు తెలిపారు.
ఆమె చివరిగా కనిపించిన ప్రాంతానికి సమీపంలోని కార్సన్ బీచ్, హార్బర్ పాయింట్ ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చేపట్టారు. ఆమెకు సంబంధించిన సమాచారం తెలిసినవారు వెంటనే తమను సంప్రదించాలని కోరారు.
కూతురి ఆచూకీ కోసం తల్లిదండ్రుల ఆవేదన
సృజా తండ్రి కొయ్య యాదగిరి రెడ్డి తన కుమార్తె కనిపించకుండా పోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నవంబర్ 2న కాలేజీకి వెళ్లి వచ్చిన తర్వాత వాకింగ్‌కు బయటకు వెళ్లిందని, అప్పటి నుంచి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ఫోన్ కూడా పనిచేయడం లేదని చెప్పారు.
తన కుమార్తె క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఆమె చదువుతున్న యూనివర్సిటీకి కూడా ఈ విషయాన్ని తెలియజేశారు.
సృజా కోసం మంత్రి కోమటిరెడ్డి ప్రయత్నాలు
తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. సృజా అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమెను సురక్షితంగా గుర్తించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
బోస్టన్లోని భారత కాన్సులేట్ జనరల్, కేంద్ర విదేశాంగ శాఖ (MEA), బోస్టన్ పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ప్రతినిధుల సహకారం కూడా కోరారు.
సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయండి
సృజా ఆచూకీ తెలిసినవారు వెంటనే బోస్టన్ పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. బోస్టన్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం, అత్యవసర సమాచారం కోసం 911కు కాల్ చేయవచ్చు. అలాగే డిస్ట్రిక్ట్ C-11 (డార్‌చెస్టర్) డిటెక్టివ్స్‌ను 617-343-4335 నంబర్లో సంప్రదించవచ్చు.
తెలంగాణకు చెందిన యువతి అమెరికాలో అదృశ్యం కావడంతో నల్గొండలోని ఆమె స్వగ్రామంలోనూ ఆందోళన నెలకొంది. సృజా సురక్షితంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆశిస్తున్నారు. పోలీసులు, భారత దౌత్య అధికారులు సమన్వయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
