
D Spiritual: Nov 7: కార్తీక మాసం సందర్భంగా కాళేశ్వరంలో ప్రత్యేక పూజలు.. లక్ష పత్రి పూజ రద్దు!
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కాళేశ్వరంలోని ప్రసిద్ధ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన ఆది ముక్తేశ్వర స్వామి ఆలయం (బాలాలయం)లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ చైర్మన్ అవధాని మోహన్ శర్మ, కార్యనిర్వహణాధికారి మహేష్ వెల్లడించారు.
ఈ నెల 10వ తేదీ నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు కార్తీక మాసం కొనసాగనుందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా బాలాలయంలో భక్తుల కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఏడాది లక్ష పత్రి పూజ రద్దు
మరోవైపు, బాలాలయంలో ప్రతి ఏడాది నిర్వహించే లక్ష పత్రి పూజను ఈసారి రద్దు చేస్తున్నట్లు చైర్మన్, ఈవో స్పష్టం చేశారు. ఆలయంలో పరిమిత స్థలం ఉండటంతో ఈ పూజ నిర్వహించే సమయంలో భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
భక్తుల రద్దీ, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కార్తీక మాసంలో ఆలయానికి వచ్చే భక్తులు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు.
